ప్రతిపక్ష నేత హోదాకు నో

ప్రతిపక్ష నేత హోదాకు నో


కాంగ్రెస్ డిమాండ్‌ను తిరస్కరించిన స్పీకర్ సుమిత్రా మహాజన్

 

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాపై కాంగ్రెస్ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. సభ నియమాలను నిశితంగా అధ్యయనం చేసిన తరువాతే కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు. స్పీకర్ కార్యాలయం నుంచి  ఒక లేఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. లోక్‌సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పీకర్ మహాజన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ అంశంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ అభిప్రాయాన్ని స్పీకర్ తెలుసుకున్నారు. లోక్‌సభలో 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ తరువాత 44 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత హోదాకోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది.



కానీ, అందుకు కావలసిన 10 శాతం సీట్లకు 11 స్థానాల దూరంలో కాంగ్రెస్ ఉన్నందున కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ప్రస్తుత నియమాలను మార్చాల్సి ఉంటుందని, ఇది సభలో జరగాల్సిన వ్యవహారమని ఆమె అన్నారు. అప్పటిదాకా తాను ప్రస్తుతం ఉన్న నియమాలను పాటించక తప్పదన్నారు. 1980, 1984లలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన విషయాల్ని కాంగ్రెస్‌కు రాసిన లేఖలో స్పీకర్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా కల్పించాలి. అంతే కాకుండా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ చైర్‌పర్సన్ నియామకాలు, జ్యుడిషియరీ అపాయింట్‌మెంట్స్ ప్యానల్‌లో ప్రతిపక్ష నేత భాగస్వామ్యం తప్పనిసరి.



లేఖ చూశాకే స్పందిస్తా: మల్లికార్జున్ ఖర్గే



స్పీకర్ నిర్ణయంపై అధిష్టానంతో, ఏఐసీసీ లీగల్ సెల్‌తో సంప్రదింపులు జరిపిన తరువాత స్పందిస్తానని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే తెలిపారు. పార్టీకి స్పీకర్ రాసిన లేఖలోని అంశాలను చూసిన తరువాత పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాన్ని చెప్తానన్నారు. స్పీకర్ నిర్ణయం వల్ల తాను ఏవిధంగానూ అసంతృప్తికి గురి కాలేదన్నారు. రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు ఇలాంటివి కొత్తేమీ కాదన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటానికి 10శాతం సీట్లు వచ్చి తీరాలని స్పీకర్ ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావటం లేదని ఖర్గే అన్నారు. లోక్‌పాల్ చైర్‌పర్సన్ వంటి ఉన్నత పదవుల నియామకానికి ప్రతిపక్ష నేత ఉండాల్సిన అవసరం ఉందని.. అలాంటప్పుడు ప్రతిపక్ష నేత లేకుండా ఈ నియామకాలను ఏవిధంగా చేపడతారని ఆయన ప్రశ్నించారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top