వానలకు ఢోకా లేదు

వానలకు ఢోకా లేదు - Sakshi


సాధారణ, భారీ వర్షాలకు 92 శాతం అవకాశం

- మే 28-30 మధ్యలోనే కేరళకు నైరుతి రుతుపవనాలు

స్కైమెట్ వెల్లడి

 

 న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్‌లో(జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్) సాధారణ, భారీ వర్షాలకు 92 శాతం అవకాశం ఉందని స్కైమెట్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా మధ్య భారతదేశం, పశ్చిమ తీర ప్రాంతం, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లలో మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఈశాన్య భారతదేశం, తమిళనాడు, దక్షిణ కర్ణాటకలలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నైరుతి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో, నైరుతి  రుతుపవనాలు ముగిసిన తర్వాత మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ తెలిపింది. జూన్ నెలలో సాధారణ వర్షపాత నమోదుకు 50 శాతం, జూలై, ఆగస్టులో 60 శాతం, సెప్టెంబర్‌లో 40 శాతం అవకాశం ఉంది.



అలాగే సాధారణం కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదుకు 50 శాతం, భారీ వర్షాలకు 25 శాతం అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి వర్షాలపై ఎల్‌నినో ప్రభావం ఉండకపోవచ్చునని, లానినో ప్రభావం మాత్రం ఉండవచ్చునని అభిప్రాయపడింది. ‘రోను తుపాను ప్రభావంతో రుతుపవనాలు అండమాన్‌కు త్వరగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పినట్లుగా నైరుతి రుతుపవనాలు ఆలస్యం కాబోవు. మే 28-30 మధ్యలోనే కేరళలోకి ప్రవేశిస్తాయ’ని స్కైమెట్ సీఈవో జతిన్‌సింగ్ తెలిపారు. ఈసారి నైరుతి ఆలస్యంగా జూన్ 7 న దేశంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ చెప్పడం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top