నగరానికి కొత్త టెర్మినస్


ముంబై, సాక్షి : కోటికిపైగా జనాభాతో కిక్కిరిసిపోయిన ముంబై నగరంలో ఎన్ని రైల్వే టెర్మినస్‌లు ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. దీంతో రైల్వే అధికారులు నిరంతరం ఈ సమస్య పరిష్కారానికి, సేవల విస్తరణకు యత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే పశ్చిమ రైల్వే మరో టెర్మినస్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం బాంద్రా, ముంబై సెంట్రల్ టెర్మినస్‌లున్నాయి. ఇప్పటికే ఈ రెండు టెర్మినస్‌లూ కిక్కిరిసిఉన్నాయి. ఏటికేటా ప్రయాణికులు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నందున అయితే వచ్చే పదేళ్లలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.



దీంతో వీటికి తోడు మరో టెర్మినస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనిపై పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ కొత్త టెర్మినస్ ఏర్పాటుకు భారీ ఎత్తున స్థలం సేకరించాలని, అయితే ఇది ముంబై ఉత్తర ప్రాంతంలోనే సమకూర్చుకోవచ్చని అన్నారు. అయితే ఖచ్చితంగా కొత్తటెర్మినస్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారన్నది ఆయన చెప్పలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కొత్త టెర్మినస్ ఏర్పడితే మరిన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అటు బోరివిలి, అంధేరి, ఇటు డహను ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉంటుందని వారు భావిస్తున్నారు.



 వృద్ధులకూ ప్రత్యేక బోగీలు : హైకోర్టు ఆదేశం

 ముంబై లోకల్ రైళ్లలో మహిళలకు కేటాయించినట్లుగానే వృద్ధులకూ ప్రత్యేక బోగీలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని పశ్చిమ, సెంట్రల్ రైల్వే అధికారులను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఓకా, జస్టిస్ ఏఎస్ చందుర్కార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు రైల్వే బోర్డుకి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. వాస్తవానికి ముంబైలోని లోకల్ రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తుంటాయి. ప్రవేశ ద్వారం వద్ద నిలబడే ఎక్కువ మంది వెళుతుంటారు.



 దీనికితోడు ఏ స్టేషన్లోనూ ఇవి పట్టుమని నిమిషం కూడా ఆగవు. దీంతో ఆ క్షణంలో దిగని పక్షంలో మరో స్టేషన్‌కి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఆ కొన్ని సెకన్లలోనే నెట్టుకుంటూ, తోసుకుంటూ లోపలికి వెళ్లడం యువకులకే కష్ట సాధ్యం. అలాంటి పరిస్థితులున్నందునే ఈ రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిలో మహిళలు కాసింత ప్రశాంతంగా వెళ్లేందుకు అవకాశం కలుగుతోంది.



 ఇదే తరహాలో సీనియర్ సిటిజన్లకూ ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ ఓ వ్యక్తి వేసిన వ్యాజ్యం మేరకు కోర్టు ఈ సూచనలు చేసింది. వాస్తవానికి సీనియర్ సిటిజన్ల కోసం సగం బోగీని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులు రైల్వే బోర్డుకు 1998, 2005లలో  ప్రతిపాదనలు పంపినా అది వాటిని తిరస్కరించింది. అయితే ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు మళ్లీ ఈ ప్రతిపాదనలు పంపుతున్నందున వాటిని ఉన్నతాధికారులు అమలు చేస్తారని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top