ఏకగ్రీవం లాంఛనమే!


సాక్షి, కర్నూలు/ఆళ్లగడ్డ :  ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఐదు దశాబ్దాల కాలంలో మొదటి సారిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయానికి మద్దతుగా పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమని అధికారికంగా ప్రకటించడం ఇక లాంఛనం కానుంది.

 

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థానానికి 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. 1967 నుంచి ఎస్వీ, భూమా కుటుంబీకులకు, గంగుల కుటుంబీకుల మధ్యే రాజకీయం పోటీ సాగుతోంది. ఇప్పటి వరకు 8 సార్లు భూమా కుటుంబీకులు గెలవగా, ఎస్వీ సుబ్బారెడ్డి ఒకసారి విజయం సాధించారు. ఐదు సార్లు గంగుల కుటుంబీకులు పైచేయి సాధించారు.



ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు బావుటా ఎగురవేశారు. కాగా.. 2014 మే నెలలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఏప్రిల్ 24న ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఆమె పేరును ఈవీఎంల నుంచి తొలగించలేదు. ఆమె అభ్యర్థిగానే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించింది. అమె మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి 92,108 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. దీంతో 17,928 ఓట్లతో శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల ముందే ఆమె ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఆమె గెలుపు చెల్లదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.



ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నంద్యాల  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ చట్టపరంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ ఆదేశించింది. ఆ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆళ్లగడ్డలో ఎన్నికల సందడి మొదలైంది. కాగా శాససభ్యులు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ పెట్టరాదనే సంప్రదాయం ఉంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరిలో నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు మొదట నిలవాలని యోచించినా.. సంప్రదాయానికి భిన్నంగా వెళ్లరాదన్న ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు.

 

ఇదే ప్రకారం సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ప్రధాన పార్టీలు పోటీ పెట్టకపోవడంతో ఉప ఎన్నిక నామమాత్రం కానుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ల ఉపసంహరణ రోజు విత్‌డ్రా చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top