అవినీతిని నిర్మూలిస్తాం: మోడీ

అవినీతిని నిర్మూలిస్తాం: మోడీ - Sakshi


హర్యానా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన

కేన్సర్ కంటే అవినీతి మహమ్మారి ఎంతో ప్రమాదకరం

ఈ జాడ్యాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటాం    


 

కైథాల్  (హర్యానా): కేన్సర్ కంటే ప్రమాదకరమైన అవినీతి జాఢ్యాన్ని దేశం నుంచి సమూలంగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. ‘‘అవినీతి.. అత్యంత ప్రమాదకరమైన అంశం. కేన్సర్ కంటే ప్రమాదకరంగా వ్యాపించి దేశాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల దీనిని నిర్మూలించడానికి గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న హర్యానాలో మంగళవారం మోడీ పర్యటించారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయన.. కైథాల్ నుంచి రాజస్థాన్ సరిహద్దు వరకు రూ.1,393 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 166 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలంటే మీ ఆశీస్సులు కావాలి. ఈ దేశానికి పట్టిన అవినీతి జాఢ్యాన్ని మీ ఆశీస్సులతో సమూలంగా నిర్మూలిస్తాను’’ అని స్పష్టంచేశారు. ప్రజలు కూడా అవినీతిని సహించే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.



అభివృద్ధితోనే అన్నీ...



20వ శతాబ్దపు సౌకర్యాలు 21వ శతాబ్దానికి ఎంతమ్రాతం సరిపోవని మోడీ పేర్కొన్నారు. మారుతున్న కాలంతోపాటే మనం కూడా ఎంతో ముందుచూపుతో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘21వ శతాబ్దంలో అవసరమైన సౌకర్యాలను పరిశీలిస్తే, కేవలం రోడ్డు లేదా రైల్వే నెట్‌వర్క్ ఒక్కటే సరిపోదు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడంతోపాటు గ్యాస్, విద్యుత్, వాటర్ గ్రిడ్లతో మన గ్రామాలన్నింటినీ అనుసంధానం చేయాలి’’ అని వివరించారు. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారమని స్పష్టంచేశారు.  ఈ సందర్భంగా రైతుల కోసం ప్రధానమంత్రి కృషి సిఖాయ్ యోజన పేరుతో ఓ ఇరిగేషన్ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రతి రైతు పొలానికి తగినంత సాగునీరు లభిస్తుందని వివరించారు. కాగా, కొత్తగా నిర్మించనున్న ఈ రహదారి వల్ల హర్యానాతోపాటు రాజస్థాన్ కూడా లబ్ధి పొందుతాయని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి, ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా తదితరులు పాల్గొన్నారు.



‘మరోసారి మోడీ కార్యక్రమానికి వెళ్లను’



కైథాల్: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మరోసారి ఏ వేదికనూ తాను పంచుకునే ప్రసక్తి లేదని హర్యానా సీఎం భూపీందర్‌సింగ్ హూడా స్పష్టంచేశారు. కైథాల్‌లో జరిగిన రహదారి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. హూడా ప్రసంగించే సమయంలో పలువురు ఆయనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిశ్శబ్దంగా ఉండాలంటూ మోడీ పలుమార్లు సూచించినా వారు వినలేదు.  ఆ నినాదాలు, గందరగోళం మధ్యే తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినవారంతా బీజేపీ కార్యకర్తలని ఆరోపించారు. ‘‘ఇది అధికారిక కార్యక్రమమైనా, రాజకీయ ర్యాలీగా మారిపోయింది. భవిష్యత్తులో ఇకపై ఎప్పుడూ మోడీ పాల్గొనే ఏ కార్యక్రమానికీ హాజరుకాబోను’’ అని పేర్కొన్నారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top