జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షకు ‘పరిహారం’

జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షకు ‘పరిహారం’

  • పోలవరం ముంపు బాధితులకు ఊరట

  • 2013 చట్టం ప్రకారం ఇవ్వాలన్న అభ్యర్థన పై పరిశీలన

  • గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి జలవనరుల శాఖకు లేఖ

  • ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు వివరాలు తెలపాలని సూచన

  • సాక్షి, న్యూఢిలీ: పోలవరం ముంపు బాధితుల పరిహారం వ్యవహారం ‘జాతీయ పర్యవేక్షణ కమిటీ’(నేషనల్ మానిటరింగ్ కమిటీ) సమీక్షకు వెళ్లనుంది. దీంతో ఈ జాతీయ ప్రాజెక్టు వల్ల ముంపు బారిన పడ్డ కుటుంబాల వారికి కొంత ఊరట లభించినట్లైంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ  జలవనరుల శాఖకు ఓ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా  ఇటీవల ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండల పరిధిలోని లక్షలాది మంది ప్రజలు తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న సంగతి విదితమే. దీనికి సంబంధించి భూసేకరణను 1894 నాటి చట్టం ఆధారంగా చేపట్టారు.



    అయితే ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉండడంతో నిర్వాసితుల్లో అధికులు తమ నివాస ప్రాంతాల్లోనే కొనసాగుతున్నారు. వారు భూసేకరణ సవరణ చట్టం 2013 ప్రకారం భౌతికంగా ఆయా ప్రాంతాలను వీడనందున, పరిహారం పొందనందునా కొత్త చట్టపరిధి మేరకు పరిహారానికి అర్హులు. ఆ మేరకు ఇటీవల ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకిస్తూ   సామాజిక మానవ హక్కుల ఫోరం అధ్యక్షుడు  డాక్టర్ పెంటపాటి పుల్లారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూవనరుల విభాగానికి అప్పీలు చేశారు.



    దీనికి స్పందించిన ఈ విభాగం సంయుక్త కార్యదర్శి ప్రభాత్ కుమార్ సారంగి జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్‌కు తాజాగా లేఖ రాస్తూ  కొత్త చట్టంలోని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన జాతీయ పర్యవేక్షణ కమిటీ ముందుకు ఈ అంశం వెళ్లిందనీ, దీనికి సంబంధించిన ప్యాకేజీ అమలును పరిశీలించి, ప్రస్తుత స్థితిని తెలపాలని కోరుతున్నామని తన  లేఖలో పేర్కొన్నారు. ఇది ముంపు బాధితులకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.

     

    చంద్రబాబు మాట మరిచారుః పెంటపాటి పుల్లారావు



    ఈ అంశంపై ‘సాక్షి’ ప్రతినిధి పెంటపాటి పుల్లారావును సంప్రదించగా.. చంద్రబాబు చాలాసార్లు పోలవరం వద్దకు వచ్చి తాను సీఎం అయితే ఎకరాకు రూ. 10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి  ఆ మాట మరిచారన్నారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిదనీ అన్నీ కేంద్ర నిబంధనల ప్రకారం జరగాలన్నారు.  పోలవరం, రామాయంపేట, చేగుంటపల్లి, తోడగుండి, పైడిపాక, ఈస్ట్‌లో దేవీపట్నం, పూడిపల్లి, అంగులూరు, చిన్నరామాయంపేట తదితర గ్రామాల ప్రజల ఆందోళన మేరకు ఇక్కడ ఎకరాకు రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచారనీ, పక్కనే మార్కెట్ ధర ప్రకారం రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లినందున కేంద్ర చట్ట ప్రకారమే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుచేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top