భారీగా రానున్న రూ. 500 నోట్లు?

భారీగా రానున్న రూ. 500 నోట్లు? - Sakshi

పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వచ్చినవి కూడా చాలావరకు 2వేల రూపాయల నోట్లు కావడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరటగా.. కొత్త 500 రూపాయల నోట్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి. నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌లో 500 నోట్ల ముద్రణను మూడు రెట్లు పెంచారు. గతంలో రోజుకు 35 లక్షల నోట్లను మాత్రమే ముద్రించేవాళ్లమని, ఇప్పుడు రోజుకు కోటి నోట్లను ముద్రిస్తున్నామని ప్రెస్ వర్గాలు తెలిపాయి. అంటే, అక్కడి నుంచి రోజుకు 500 కోట్ల రూపాయల కరెన్సీ 500 నోట్ల రూపంలో బయటకు వస్తోందన్న మాట. వాటితో పాటు మరో 90 లక్షల వేర్వేరు నోట్లు కూడా ముద్రిస్తున్నామని, రోజుకు మొత్తం 1.90 కోట్ల నోట్లు నాసిక్ ప్రెస్‌ నుంచి వస్తున్నాయని వివరించారు. వాటిలో 100, 50, 20 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్త 2వేల రూపాయల నోట్లను మాత్రం ముద్రించడం లేదు. 

 

శుక్రవారం నాడు మొత్తం 4.30 కోట్ల నోట్లను రిజర్వు బ్యాంకుకు పంపారు. వాటిలో 1.1 కోట్ల 500 రూపాయల నోట్లు, 1.2 కోట్ల 100 రూపాయల నోట్లు,  కోటి చొప్పున 50, 20 రూపాయల నోట్లు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రిజర్వు బ్యాంకుకు కొత్త నోట్లు అందడం ఇదే మొదటిసారి. తొలిసారిగా నవంబర్ 11వ తేదీన ఇక్కడి నుంచి కేవలం 50 లక్షల 500 రూపాయల నోట్లను మాత్రమే పంపారు. గత 43 రోజుల్లో నాసిక్ ప్రెస్ నుంచి మొత్తం 82.8 కోట్ల నోట్లు రిజర్వు బ్యాంకుకు చెందిన వివిధ కార్యాలయాలకు చేరాయి. వీటిలో 25 కోట్ల నోట్లు 500 రూపాయలవి. గత మూడు రోజుల్లో 8.3 కోట్ల నోట్లు పంపిణీ చేయగా, వాటిలో 3.75 కోట్ల నోట్లు 500 రూపాయలవి. జనవరి 31 నాటికి మరో 80 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించి పంపగలమని నాసిక్ ప్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో సగం వరకు కొత్త 500 రూపాయల నోట్లు ఉంటాయి. 

 

దేశంలో మొత్తం నాలుగు మాత్రమే కరెన్సీ నోట్ ముద్రణ ప్రెస్‌లు ఉన్నాయి. వాటిలో రెండు మైసూరులోని రిజర్వు బ్యాంకు వద్ద ఉండగా, మరొకటి బెంగాల్‌లోని సల్బోని వద్ద, ఇంకోటి నాసిక్‌లోను ఉన్నాయి. ప్రస్తుతం నాసిక్ ప్రెస్‌లో ఆదివారాలు కూడా సెలవులు ఇవ్వడం లేదు. సిబ్బంది లంచ్, డిన్నర్ బ్రేక్‌లు కూడా తీసుకోవడంలేదు. అంతేకాదు, సిబ్బంది పని వేళలను కూడా రోజుకు 11 గంటలకు పెంచారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top