కొత్త పార్టీ పెట్టిన బహిష్కృత నేత

కొత్త పార్టీ పెట్టిన బహిష్కృత నేత


లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి బహిష్కరణకు గురైన పార్టీ సీనియర్ నేత నసీముద్దీన్ సిద్దిఖీ కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన సిద్ధిఖీ శనివారం కొత్తపార్టీని ఏర్పాటు చేశారు. తమ పార్టీకి 'రాష్ట్రీయ బహుజన్ మోర్చా' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. మాయావతి సొంత నిర్ణయాల వల్లే 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ దారుణ పరాభవాన్ని చవిచూసిందని సిద్ధిఖీ తీవ్ర ఆరోపణలు చేశారు.



మాయావతి ముస్లింలను తప్పుదోవ పట్టించారని, తమ సామాజిక వర్గంపై దారుణ వ్యాఖ్యలు చేశారని పార్టీ అధినేత్రికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో సిద్ధిఖీతో పాటు ఆయన కుమారుడు అఫ్జల్ సిద్ధిఖీని పార్టీ నుంచి రెండు వారాల కిందట బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే సిద్ధిఖీకి కబేళాలున్నాయని, వాటితో పాటు బినామీ ఆస్తులున్నాయన్న కారణంతోనే పార్టీ నుంచి తొలగించినట్లు బీఎస్పీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మాయావతికి కూడా బినామీ ఆస్తులున్నాయని, సమయం వచ్చినప్పుడు నిరూపిస్తానని సిద్ధిఖీ పేర్కొన్నారు.



గత ఏప్రిల్‌లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా మాయావతి తన సోదరుడు ఆనంద్‌ కుమార్‌ను నియమించారు.అయితే ఎప్పటికీ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు ఆశించరాదని మాయావతి తన సోదరుడికి షరతు విధించిన తర్వాతే కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ సిద్ధిఖీ తన సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని, మాయావతి సొంత విధానాల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top