కనిమొళికి నో ఎంట్రీ

కనిమొళికి నో ఎంట్రీ - Sakshi


 చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ రాజకీయాల్లో ప్రభావశీల శక్తిగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితం కావాలని డీఎంకే చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళిని కలుసుకునేందుకు మోదీ నిరాకరించి షాక్ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రధాన సూత్రధారిగా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి పాత్రధారిగా సీబీఐ కేసులు పెట్టింది. అంతేగాక 2 జీ స్పెక్ట్రంకు చెందిన నిధులు అక్రమ మార్గంలో కలైంజర్ టీవీ చానల్‌కి చేరాయని ఆరోపిస్తున్న సీబీఐ ఆ చానల్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న కరుణ సతీమణి దయాళు అమ్మాళ్‌ను కూడా కేసులో చేర్చింది.


కరుణ సోదరి కుమారుడైన మరో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌పై కూడా సీబీఐ కేసులు ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలనలో కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉంటూ కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వీరంతా కరుణ కుటుంబీకులు, డీఎంకే నేతలే కావడం గమనార్హం. ఈ అప్రతిష్టకు తోడు శ్రీలంక వ్యవహారంలో సైతం డీఎంకే సరైన పంథాను అనుసరించలేదని తమిళులు మండిపడుతున్నారు. ఇలా అన్ని కారణాల ఫలితంగా గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్టు సైతం కోల్పోయింది. మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా గెలుపు అవకాశాలకు ఆమడ దూరంలో డీఎంకే చతికిలబడి ఉంది.

 

 చెక్కుతో చెక్ పెట్టే యత్నం

 ఎన్నికల నాటికి జవసత్వాలు కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్న డీఎంకే కాశ్మీర్ వరదల ఉదంతాన్ని రాజకీయంగా 'క్యాష్‌' చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రకృతి విలయానికి సుందర కాశ్మీరం అల్లకల్లోలం కాగా అక్కడి సహాయక చర్యల కోసం భూరి విరాళాలు అందజేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ఒక్కసారిగా తమవైపు తిప్పుకునేందుకు ఇదే మంచి తరుణంగా కరుణ భావించారు. అంతేగాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేరువ కావడం ద్వారా అన్నాడీఎంకేకు చెక్‌పెట్టాలని ఎత్తువేశారు. 


ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళాన్ని గతనెల 13న కరుణ ప్రకటించారు. విరాళ చెక్కును కనిమొళి నేతృత్వంలోని డీఎంకే ఎంపీల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తుందని స్పష్టం చేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో అపాయింట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు పీఎంవో నుంచి పిలుపురాలేదు. అనేక సార్లు చేసిన యత్నాలు విఫలం కావడంతో విసుగుచెందిన డీఎంకే నేతలు తిరిగి చెన్నైకి చేరుకున్నారు. రాజకీయాల్లో దూసుకుపోవడంలో ఆచితూచి అడుగేయాలన్న సిద్ధాంతాన్ని మోదీ పాటిస్తున్నట్లు ఈ ఉదంతం తేటతెల్లం చేసింది.

 

 అక్రమార్కులకు మోదీ దూరం

 ఈ వ్యవహారంపై ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత మాట్లాడుతూ, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ (బీజేపీ) నేతలనే మోదీ దూరం పెట్టారని, ఇటువంటి పరిస్థితిల్లో 2 జీ స్పెక్ట్రం కుంభకోణంలో కూరుకుపోయిన కనిమొళిని ఆయన ఎలా కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ బాధితుల సహాయార్థం చెక్కును అందజేసే సందర్భంగా మోదీ, కనిమొళి కలిసినా జాతీయస్థాయిలో వివాదాస్పద చర్చకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు. ఈకారణంగానే కనిమొళి బృందం కలుసుకునేందుకు పీఎంఓ కార్యాలయం నుంచి అనుమతి లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంతో రూ.25 లక్షల కాశ్మీర్ సహాయ నిధి చెక్కు నెల రోజులుగా కనిమొళి వద్దనే కునుకు తీస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top