800 ఏళ్ల తర్వాత మళ్లీ ....

రాజ్గిరిలోని నలంద విశ్వవిద్యాలయంలో తరగతులకు వస్తున్న విద్యార్థులు


 బీహార్ షరీఫ్:-  ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో సోమవారం మళ్లీ  తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని రాజ్‌గిరిలో పునరుద్ధరించిన విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది.  విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.  వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్సలర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు.

 

 ఈ సందర్భంగా గోపా సభర్వాల్  మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని  చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్ష కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న వర్సిటీని సందర్శిస్తారన్నారు.   వివిధ కోర్సులకు 35దేశాల విద్యార్థుల నుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.  సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top