‘ఎన్నికల’ ట్యాక్సీలకు అద్దె పెంచాలి


- ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్

- ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దె చాలడం లేదని ఆవేదన

సాక్షి, ముంబై:
ఎన్నికల పనులకు వినియోగించే ట్యాక్సీలకు ఎక్కువ అద్దె చెల్లించాలని ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్  డిమాండ్ చేస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు, ఇంధనం, ఇతర సామగ్రి ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె గిట్టుబాటు కావడం లేదని, కచ్చితంగా పెంచివ్వాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో ప్రైవేటు వాహనాలతోపాటు ట్యాక్సీల వినియోగం కూడా అధికంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఇంటి నుంచి ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత పోలింగ్ బూత్‌లకు చేరవేయడం లాంటి పనులు ఉంటాయి.

 

ఎన్నికల తంతు పూర్తయిన తర్వాత మళ్లీ వారివారి ఇళ్లకు చేరవేయడం లాంటి పనులు ఉంటాయి. ఓట్ల లెక్కింపు రోజున మళ్లీ వారి అవసరముంటుంది. ఇందులో కొన్ని ట్యాక్సీలను బందోబస్తుకు పోలీసులు కూడా వాడుకుంటారు. ఇలా వివిధ పనులకు ఎన్నికల సమయంలో ట్యాక్సీలను పెద్ద సంఖ్యలో వినియోగిస్తారు. అందుకు యూనియన్ ప్రతినిధులతో సంప్రదిస్తారు. వారు ఆసక్తిగల ట్యాక్సీ డ్రైవర్లను, యజమానులను ఎంపికచేసి ఎన్నికల పనులకు పంపిస్తారు. అందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ట్యాక్సీ డ్రైవర్లు 24 గంటల్లో సంపాదించే మొత్తాన్ని చెల్లిస్తారు.



ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 1,500పైగా ట్యాక్సీలను వినియోగించారు. ఇందులో 900లకుపైగా ట్యాక్సీలను నగరంలో మిగతావి శివారు ప్రాంతాల్లో వాడుకున్నారు. 24 గంటల అద్దె ప్రకారం (100 కి.మీ.లోపు) ఒక్కో ట్యాక్సీకి రూ.1,830 చొప్పున చెల్లించారు. ఒకవేళ 100 కి.మీ. దాటితే కి.మీ.కు రూ.12 చొప్పున అదనంగా చెల్లించారు. ప్రస్తుతం ఆ అద్దె గిట్టుబాటు కాదని వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో అద్దె పెంచివ్వాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

గతంలో కార్పొరేషన్, లోక్‌సభ, శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో ఈ మొత్తాన్ని కొంత పెంచి ఇచ్చారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ప్రభుత్వం చెల్లించే అద్దె గిట్టుబాటు కావడంలేదని ట్యాక్సీ డ్రైవర్లు, యజమానులు వాదిస్తున్నారు. ప్రైవేట్ టూరిస్టు వాహనాలతో పోలిస్తే ట్యాక్సీలు చాలా చౌక అద్దెకు లభిస్తాయి. టూరిస్టు వాహనాలకు రోజుకు 200 కి.మీ.చొప్పున (తిరిగినా, తిరగకపోయినా) అద్దె చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పోలిస్తే ట్యాక్సీలు ఎంతో లాభదాయకంగా ఉంటాయని యూనియన్ అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top