లౌకిక కూటమికి షాక్!

లౌకిక కూటమికి షాక్! - Sakshi


బిహార్లో మహా కూటమి నుంచి వైదొలగిన ములాయం

♦ 5 స్థానాలే కేటాయించడం అవమానకరమని సమాజ్‌వాదీ వ్యాఖ్య

♦ దిద్దుబాటు చర్యల్లో జేడీయూ; ములాయంతో శరద్ యాదవ్ భేటీ



 లక్నో/న్యూఢిల్లీ/పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఒక్కటైన లౌకిక కూటమికి ఆదిలోనే గట్టి దెబ్బ పడింది. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు గురువారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అధినేత ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  సీట్ల సర్దుబాటు సమయంలో తమను సంప్రదించలేదని, అది కూటమి ధర్మం కాదని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీట్ల పంపకం గురించి మీడియా ద్వారానే తమకు తెలిసిందన్నారు. 5 స్థానాలు మాత్రమే తమకు కేటాయించడం అవమానంగా భావిస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.




ఒంటరిగా పోటీ చేసి, అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోగలమన్నారు. ఎస్పీ హఠాత్ నిర్ణయంతో కంగుతిన్న జనతా పరివార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ములాయంతో మాట్లాడారు. అనంతరం హుటాహుటిన ఢిల్లీలోని ములాయం నివాసానికి వెళ్లి దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. బయటకు వచ్చిన అనంతరం మీడియాతో.. బిహార్లో లౌకిక కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. విభేదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. అయితే, రాజీకి వచ్చారా? సీట్ల పంపకంలో పునరాలోచన ఉందా? అన్న ప్రశ్నలకు ఆయన సూటిగా బదులివ్వలేదు. ఆ సమాచారాన్ని మీడియాతో పంచుకోలేమంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.




ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రధాని మోదీతో భేటీ కావడం, రామ్ గోపాల్ యాదవ్ సోమవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం కావడం.. ఎస్పీ తాజా నిర్ణయం వెనక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ వార్తలను శరద్ యాదవ్ కొట్టిపారేశారు. ములాయం అలాంటి నేత కాదని చెబుతూ.. ఆయనను 'మౌలానా ములాయం' అని పిలుస్తుంటారనే విషయాన్ని గుర్తు చేశారు. 'అలాంటి వార్తలను సృష్టించవద్దు. ములాయం రాజకీయాలకు కొత్తేం కాదు. పార్టీలకు అతీతంగా వేర్వేరు పార్టీల నేతలు కలుసుకోవడం సహజమే. నేను కూడా ఇతర పార్టీల నాయకులను కలుస్తుంటాను. దానర్థం నేను వారితో కుమ్మక్కయినట్లు కాదు కదా!' అన్నారు. లౌకిక పార్టీల కూటమి నుంచి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వైదొలగిన అనంతరం, తాజాగా ఎస్పీ కూడా అదే బాటన నడవడంతో రాష్ట్రంలో లౌకికవాదుల ఓట్లు మరింతగా చీలుతాయని భావిస్తున్నారు. మరోవైపు, ఎన్నికల వేళ ఆర్జేడీకి మరో దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పార్టీలో బ్రాహ్మణ వర్గ ప్రతినిధి రఘునాథ్ ఝా పార్టీని వీడి, సమాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. లాలూప్రసాద్ యాదవ్ అనుసరిస్తున్న కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  మరోవైపు, ఎస్పీ నిర్ణయాన్ని ఎన్సీపీ స్వాగతించింది. కలసివస్తే, ఎస్పీతో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించింది.

 పరివార్ పార్టీల విలీనానికీ దెబ్బే..

 బిహార్‌లో ఐక్య కూటమిగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య తలెత్తిన విభేదాల్ని ములాయం సింగ్ యాదవే పరిష్కరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేడీయూ నేత, ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌ను ప్రకటించేలా లాలూ ప్రసాద్‌ను ఒప్పించింది ములాయమే కావడం విశేషం. ఎస్పీ తాజా నిర్ణయంతో ఆరు జనతా పరివార్ పార్టీలు.. ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్, ఐఎన్‌ఎల్‌డీ, ఎస్‌జేపీలు విలీనమై ఒక రాజకీయ పార్టీగా అవతరించే ప్రయత్నాలకు కూడా విఘాతం కలిగే అవకాశముంది. బిహార్ ఎన్నికల అనంతరం విలీనం దిశగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ ఏప్రిల్‌లో జనతా పరివార్ ముఖ్య నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. బిహార్ అసెంబ్లీలోని 243 స్థానాలకు గానూ మహా లౌకిక కూటమిలోని జేడీయూ, ఆర్జేడీలు 100 స్థానాల చొప్పున, కాంగ్రెస్ 40 సీట్లలో పోటీ చేయాలని తొలుత నిర్ణయించాయి. మిగతా 3 సీట్లను ఎన్సీపీకి కేటాయించారు. కేవలం 3 స్థానాలే కేటాయించడంతో అలిగిన ఎన్సీపీ కూటమి నుంచి తప్పుకుంది. ములాయం కోసం తమ వాటాలో నుంచి రెండు స్థానాలను ఇచ్చేందుకు లాలూ అంగీకరించడంతో.. ఎన్సీపీకి కేటాయించాలనుకున్న మూడు స్థానాలతో పాటు, ఆర్జేడీ వాటాలోని రెండు స్థానాలను కలిపి మొత్తం 5 సీట్లను ఎస్పీకి కేటాయించారు. బిహార్లో ఎస్పీకి పెద్దగా  అస్తిత్వం లేదు. గత ఎన్నికల్లో 146 స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, కేవలం 0.55% ఓట్లను మాత్రమే సాధించగలిగింది.

 మహాకూటమి మునిగిపోతున్న నావ

 బిహార్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన మహా కూటమిని మునిగిపోతున్న నావ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అభివర్ణించారు. ఆ పడవ నుంచి మొదట దూకేసిన ములాయం.. రాజకీయంగా తనను, తన పార్టీని కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు. ‘కూటమి నేతృత్వంలో జరిగిన స్వాభిమాన్ ర్యాలీ అనంతరం ములాయంలో స్వాభిమాన్ నిద్ర లేచిందేమో’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top