‘అగస్టా’ గాంధీ ఎవరో తేల్చండి

‘అగస్టా’ గాంధీ ఎవరో తేల్చండి


రాజ్యసభలో తృణమూల్ ఎంపీ  సుఖేందు డిమాండ్

♦ అగస్టాపై చర్చించకుండా అడ్డుపడుతున్నారు: వెంకయ్య

 

 న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో పేర్కొన్న గాంధీ, ఏ.పీ.లు ఎవరో చెప్పాలంటూ  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు రాయ్ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కొద్దిసేపు హడావుడి చేశారు. రక్షణ శాఖ మంత్రి ప్రకటన చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, ముడుపులు తీసుకున్నట్లు చెపుతున్న ఏపీ, గాంధీ, శశికాంత్ పేర్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాయ్ ఎంతకీ శాంతించకపోవడంతో చైర్మన్ హమీద్ అన్సారీ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా తృణమూల్ ఎంపీలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు.



మరోవైపు అగస్టా కుంభకోణంలో కీలక పత్రాల్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే లీకు చేస్తోందంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పలువురు వ్యక్తులతో పాటు, వివిధ న్యూస్ చానళ్లకు, విలేకరులకు పత్రాలు అందచేస్తున్నారని, లీకులతో విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని ఆ పార్టీ ఉప నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. రక్షణ శాఖ, వైమానిక విభాగ ప్రధాన కార్యాలయం, సీబీఐ, ఈడీల విశ్వసనీయతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లీకులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.



 కాంగ్రెస్ అడ్డుపడుతోంది: వెంకయ్య

 ‘అగస్టా’ హెలికాప్టర్ల కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సభకు సంబంధం లేని అంశాల్ని కాంగ్రెస్ పార్టీ  ప్రస్తావిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు.  సోమవారం పార్లమెంట్ వెలుపల మాట్లాడుతూ... గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన కేజీ బేసిన్ అవకతవకలకు సంబంధించి కాగ్ నివేదికపై రాజ్యసభను పదే పదే అడ్డుకున్నారని తప్పుపట్టారు. ఈ అంశం రాష్ట్రానికి సంబంధించిందని, తప్పుడు ఉద్దేశంతో సభకు సంబంధంలేని విషయాల్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తుందని చెప్పారు. అగస్టా కుంభకోణంపై చర్చించేందుకు కాంగ్రెస్ సభ్యులు ఎందుకు ఇష్టపడడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుకు, అగస్టా అంశానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. అగస్టాను బ్లాక్‌లిస్టులో పెట్టలేదంటూ 2013లో రాజ్యసభకు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పారని, అయితే సభను మాత్రం కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని చెప్పారు .



 ఎస్పీ త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

 అగస్టా కుంభకోణంలో వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఉదయం 10 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చిన త్యాగిపై పది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇటలీలోని మిలాన్ కోర్టు తీర్పు వివరాల్లో పలు సార్లు త్యాగి పేరును ప్రస్తావించడంతో ఈ కేసులో ఆయన చెప్పే వివరాలు కీలకంగా మారాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top