ఇక థియేటర్లలో ‘మూవీ ఆన్‌ డిమాండ్‌’




న్యూఢిల్లీ: కొత్త సినిమాలు చూడాలంటే ముందుగా టిక్కెట్లు కొనుక్కోవాలి. థియేటర్‌కు వెళ్లాలి. చూడాలి. అవే పాత సినిమాలు చూడాలంటే నెట్‌ కనెక్షన్‌ ద్వారా కంప్యూటర్లలోనో, టీవీల్లోనో చూడాలి. వాటినే థియేటర్‌కెళ్లి చూడాలంటే సాధ్యం కాదు. కానిప్పుడు సాధ్యం. ఒక్క పాత సినిమాలే కాదు, పాత, కొత్త తేడాలేకుండా మనకు నచ్చే ఏ సినిమానైనా దగ్గరలోవున్న థియేటర్‌లోనో, మల్టీప్లెక్స్‌లోనో, అదీ ఆ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులతో కలిసే చూడొచ్చు. ఆ సినిమాను తీసిన దర్శకులను, ఇతర సాంకేతిక వర్గాన్ని, అందుబాటులో ఉంటే ఆ సినిమా హీరో, హీరోయిన్లను కలుసుకొని ఆ సినిమా గురించి చర్చించవచ్చు. పంపిణీదారులు దొరక్క అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకే పరిమితమయ్యే సినిమాలను కూడా చూడవచ్చు.



‘1018 ఎంబీ’ అనే కంపెనీ ఈ సదుపాయాన్ని మనకు అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి సౌమ్య టాండన్, సౌరబ్‌ దేవేంద్ర సింగ్, శిశిర్‌ రంజన్, సంతోష్‌ కుమార్‌ సుందరమ్, అభయ్‌ సాల్వే కలసి ‘1018 ఎంబీ’ అనే కంపెనీని 2015లోనే ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు అది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇటీవల  హిట్టయిన ‘అంగమలి డైరీలు’ అనే మలయాళం సినిమాను ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ప్రేక్షకుల డిమాండ్‌పై ఈ కంపెనీ ప్రదర్శించింది. అలాగే సుభాష్‌ ఘై 1999లో తీసిన తాల్‌ను ఇటీవల ముంబై మల్టీఫ్లెక్స్‌లో ప్రదర్శించారు. ప్రేక్షకులతో ముచ్చటించేందుకు సుభాష్‌ ఘై కూడా వచ్చారు. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వొసాయ్‌పూర్, అందాజ్‌ అప్నా అప్నా, బ్లాక్‌ ఫ్రైడే, డిస్కో డాన్సర్, అమర్‌ అక్బర్‌ ఆంటోని’ తదితర చిత్రాలను ప్రదర్శించారు. ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు త్వరలో ఎంటర్‌ ది డ్రాగన్, కర్జ్, పరిందా, కల్‌ నాయక్, హమ్‌ ఆప్కే హై ఖోన్, జానీ గద్దార్‌’ చిత్రాలను ప్రదర్శించనున్నారు. జాబితాలో లేని సినిమాలను కూడా ప్రేక్షకులు కోరుకోవచ్చు. ప్రేక్షకుల సంఖ్యనుబట్టి ఆ సినిమాల స్క్రీనింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.



ప్రస్తుతం 300 సినిమాలు

ప్రస్తుతం ఈ కంపెనీ నెట్‌వర్క్‌ వద్ద దాదాపు మూడు వందల సినిమాలు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి. ఆ జాబితా నుంచి ప్రేక్షకులు తమ ఇష్టమైన సినిమాను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు. థియేటర్‌ కెపాసిటీని బట్టి కంపెనీ కోరుకున్న ప్రేక్షకుల సంఖ్య ఖరారు కాగానే ఆ సినిమాని ఎక్కువ మంది ప్రేక్షకులన్న సమీప థియేటర్‌లో ప్రదర్శిస్తారు. రెండు, మూడు ప్రాంతాల వారు ఒకే సినిమాను కోరుకుంటే నిర్దిష్ట సంఖ్యనుబట్టి ప్రేక్షకులకు అనువుగా వారి ప్రాంతాలకు సమీపంలోని థియేటర్లలో వేర్వేరు ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. ఏ ప్రాంతం వారు ఏ సినిమాను కోరుకుంటున్నారో కంపెనీ నెట్‌వర్క్‌ ఎప్పటికప్పుడు డేటాను సమీకరిస్తుంది. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లోని థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లతోని ఈ సినిమా నెట్‌వర్క్‌ కంపెనీ ‘టై అప్‌’ పెట్టుకొంది.



ఫిల్మ్‌ క్లబ్‌లకు 1018 ఎంబీకి తేడా ఏమిటీ?

దేశంలోని ఫిల్మ్‌క్లబ్‌లు సాధారణంగా క్లాసిక్‌ సినిమాలనే ప్రదర్శిస్తాయి. సినిమాల ఎంపికలో ప్రేక్షకుల పాత్ర ఉండదు. నిర్వాహకుల పాత్రే ఉంటుంది. 1018 నెట్‌వర్క్‌లో ప్రేక్షకుల ఎంపికే ముఖ్యం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ సినీ నెట్‌వర్క్‌ సర్వీసులు ఉన్నాయి. వాటిని చూడాలంటే ఇంట్లోని టీవీలు లేదా ప్రొజెక్టర్‌ స్క్రీన్లపై చూడాలి. పీవీర్‌ సినిమా మల్టీఫెక్స్‌ చెయిన్‌ ఇటీవల ‘యాప్‌ వికావో’ను ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది ప్రేక్షకులు కోరుకున్న సినిమానే ఈ నెట్‌వర్క్‌ ప్రసారం చేస్తుంది. అదీ పీవీఆర్‌ థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొని థియేటర్లలో విడుదల కానీ ‘కాపిటల్‌ ఐ’ అనే ఒడియా సినిమాను ఇటీవల 1018 ఎంబీ నెట్‌వర్క్‌ ద్వారా ప్రదర్శించారు. ఇలాంటి సినిమాలకు తాము పంపిణీదారుగా వ్యవహరిస్తామని కంపెనీ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.



1018 ఎంబీ అంటే ఏమిటీ?

కచ్చితంగా చెప్పాలంటే 1024 మెగాబైట్లకు ఒక గెగాబైట్‌ (సాధారణంగా వెయ్యి మెగాబైట్లను గెగాబైట్‌గా గుర్తిస్తున్నారు). దీన్ని స్ఫూర్తిగా తీసుకొనే నిర్వాహకులు ఈ టైటిల్‌ను ఖరారు చేసుకున్నారట. ఆరు తక్కువ సంఖ్యను ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, ఐదుగురు నిర్వాహకులు, ఒక ప్రేక్షక నెట్‌వర్క్‌ కలిపితే 1024 అవుతుందన్నది వారి లెక్కట.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top