యూపీలో గూండా రాజ్యం

యూపీలో గూండా రాజ్యం - Sakshi


సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు

► ఓటమి భయంతో అఖిలేశ్‌ ముఖం కళ తప్పింది

► యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం


ఫతేపూర్‌: ఉత్తరప్రదేశ్‌లో గూండా రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్‌వాదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని ఆయన తప్పుపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫతేపూర్‌ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... యూపీలో పోలీసుస్టేషన్లు సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు.


‘అఖిలేశ్‌ యాదవ్‌ ముఖం కళ తప్పింది. అతని మాటతీరు నీరసపడింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో పాటు, మాటల కోసం వెదుకులాడుతున్నారు. ఆటలో ఓటమిని ఆయన అంగీకరించారు’ అని మోదీ పేర్కొన్నారు అఖిలేశ్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ‘రాష్ట్రంలో పోలీసు విభాగం ఎందుకు అంత అసమర్ధంగా ఉంది? ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదు? ఇదేం పనితీరు?’ అంటూ మోదీ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రజాపతి తరఫున అఖిలేశ్‌ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  



1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం

పదేళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందంటూ ఎస్పీ, బీఎప్పీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామన్నారు.  ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 1.45 కోట్ల  ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు.  రాహుల్‌ గాంధీని పరోక్షంగా విమర్శిస్తూ... ‘ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదన్న విషయం పుట్టుకతోనే ప్రముఖులైనవారికి అర్థమైంది. అందుకే ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడింది’ అని విమర్శించారు. యూపీని దత్తత తీసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.



శివాజీయే ఆదర్శం

న్యూఢిల్లీ: మరాఠా యోధుడు శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు.  శివాజీ ఆలోచనలతోనే తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ‘శివాజీ వంటి గొప్ప నేత మన గడ్డపై పుట్టి మనల్ని పాలించటం గర్వకారణం. ధైర్య, సాహసాలు, సుపరిపాలనకు ఆయన పర్యాయపదం. ముంబైలో గొప్పగా శివ్‌స్మారక్‌ నిర్మించటమే ఆయన గొప్పతనానికి జాతి ఇచ్చే అసలైన నివాళి’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top