మోదీ ప్రభుత్వం సూపర్

మోదీ ప్రభుత్వం సూపర్ - Sakshi


- సంతృప్తి వ్యక్తం చేసిన 64 శాతం ప్రజలు

- తాజా అధ్యయనంలో వెల్లడి

 

 న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల ప్రభుత్వ పాలన తీరుపై మూడింట రెండొంతుల మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది.  20 అంశాలతో కూడిన పత్రాన్ని 15 వేల మంది పట్టణవాసులకు అందించి అభిప్రాయాలు సేకరించారు. 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగుందని అభిప్రాయపడగా.. 34 శాతం మంది అనుకున్నంత బాగా లేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళలు, చిన్నారుల భద్రత, ధరల నియంత్రణ తదితర కీలక అంశాల్లో మరిన్ని చర్యలు అవసరమని వారు అభిప్రాయపడినట్లు పేర్కొంది.



మొత్తంగా 76 శాతం మంది ప్రజలు భారత్‌లో తమ, తమ కుటుంబ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు సర్వే వివరించింది. అయితే రానున్న మూడేళ్లలో పెట్టుబడులు అధికంగా రాబట్టి, భారీగా ఉద్యోగాలు కల్పించాలని అధికశాతం మంది కోరుకుంటున్నట్లు పేర్కొంది. ‘జీఎస్‌టీ ఆమోదం తదితర అంశాలతో ప్రభుత్వం బాగా పనిచేసిందని 61 శాతం మంది భావించగా.. 30 శాతం మంది పనితీరు బాగా లేదని భావిస్తున్నారు. మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయడంలో మంచి పనితీరు కనబరిచినట్లు సుమారు 72 శాతం మంది అభిప్రాయపడగా.. 20 శాతం మంది దీనికి భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు’ అని నివేదిక తెలిపింది. పలువురు ప్రవాస భారతీయులతో పాటు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో 20 సార్లు ఓటింగ్, చర్చలు జరిపి ఈ నివేదిక తయారు చేశారు. ఒక్కోసారి ఓటింగ్‌లో సుమారు 15 వేల మంది చొప్పున 3,75,568 మంది ప్రజల అభిప్రాయాలతో నెల రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు. అలాగే 18 ఏళ్లకు పైబడిన అన్ని వయసుల వారినీ ఓటింగ్‌లో పరిగణనలోకి తీసుకున్నారు.

 

 ‘మైనారిటీలకు నమ్మకం పెరిగింది’

  మోదీపై మైనారిటీల్లో నమ్మకం పెరిగిందని బీజేపీ ప్రకటించింది. రెండేళ్ల మోదీ పాలనలో మతకలహాలు 82 శాతం తగ్గాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మైనారిటీల వాటా పెరిగిందని మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. బీజేపీ అభివృద్ధి అజె ండా వల్లే ముస్లింలు అధికంగా గల అస్సాం, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధించామన్నారు. 2013-14లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 6.91 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగిందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top