ఆ విషయం మేమెందుకు చెప్పాలి?: అమిత్‌ షా

ఆ విషయం మేమెందుకు చెప్పాలి?: అమిత్‌ షా - Sakshi


న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయలేని పనులన్నింటినీ తాము మూడేళ్లలో చేసి చూపించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) అధికారంలోకి వచ్చి నేటితో (శుక్రవారం) మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడేళ్ల పాలనపై అమిత్‌ షా పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వమని, అవినీతి రహితంగా పాలన కొనసాగిస్తున్నామన్నారు. సర్టికల్‌ స్ట్రయిక్స్‌, నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని, అలాగే వీఐపీ కల్చర్‌ను తుదముట్టించామని అమిత్‌ షా తెలిపారు.


అలాగే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రకటించిన సాయంలో తాను చెప్పిన ఏ విషయం అమలు కాలేదో చెప్పాలని  అమిత్‌ షా సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు లక్ష కోట్ల వరకు సాయం చేసిందని రాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, తప్పుడు ప్రచారం చేసినందుకు అమిత్‌ షా రాష్ట్ర ప్రజలకు క్షమాణలు చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్‌ షా.. స్పష్టమైన వివరాలతో ఏ పథకానికి ఎంత ఇచ్చామో వివరించానని చెప్పారు. తాను చెప్పింది జరగలేదని నిరూపించాలని అన్నారు. కేసీఆర్‌ తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.


కాగా, అంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి తెగతెంపులు చేసుకుందామని బీజేపీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు సలహాలు అందిన మాట వాస్తవమేనని అమిత్‌ షా స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం జరిగిన బీజేపీ బూత్‌స్థాయి కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలుగుదాం అని ప్లకార్డులు ప్రదర్శించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అమిత్‌ షా ఈ విషయం తెలిపారు.


‘ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకుందాం అని పలువురు సలహా ఇచ్చారు. ఈ మాట వాస్తవమే. ఈ విషయంలో బీజేపీ నిర్ణయం ఏంటనేది మీడియాకు ఎందుకు వెల్లడించాలి’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామన్నామే కానీ, బీజేపీలోకి రావడాన్ని అని తాము అనలేదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top