యూపీ, ఢిల్లీ బాటలో నడవండి!

యూపీ, ఢిల్లీ బాటలో నడవండి! - Sakshi


బీజేపీకి ఓటేయండి

- హిమాచల్‌ ప్రజలకు మోదీ విజ్ఞప్తి

- ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు




సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లో మార్పు పవనాలు వీస్తున్నాయని.. ఇక్కడి ఓటర్లు కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలాగే బీజేపీకి ఓటేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిమ్లాలో ఏర్పాటు చేసిన పరివర్తన్‌ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం వీరభద్రసింగ్‌ ఎక్కువ సమయం న్యాయవాదులతోనే గడుపుతున్నారని ఈ సందర్భంగా ప్రధాని విమర్శించారు. ‘హిమాచల్‌ ప్రదేశ్‌ నీతివంతమైన పాలనకోసం ఎదురుచూస్తోంది.



గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచే చలికాలంలో ఉన్నిదుస్తులు సరఫరా అయ్యేవి. కానీ ఇప్పుడు ఇక్కడికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి స్వచ్ఛమైన మార్పు పవనాలు వీస్తున్నాయి’ అని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటేసి తనతోపాటుగా సత్యమార్గంలో నడవాలని కోరారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అవినీతిని తరిమికొట్టాలని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి లాభం జరిగేలా పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ‘మా ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నష్టపోయిన వారు అసంతృప్తిగా ఉన్నారు. నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తారనే విషయం తెలుసు. అయినా నేను సిద్ధంగా ఉన్నాను’ అని మోదీ తెలిపారు.



నల్లధనం, జీఎస్టీపై సమీక్ష

ప్రధాని మోదీ వచ్చే మే 2న రెవెన్యూ అధికారులతో సమావేశం కానున్నారు. నోట్లరద్దు తర్వాత నల్లధన వ్యతిరేక కార్యక్రమాలు, సేకరించిన పన్ను, జీఎస్టీ అమలుపైనా మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 8 తర్వాత పరిణామాలపై రిపోర్టు కార్డును రెవెన్యూ అధికారులు ఈ సమావేశంలో ప్రధానికి వివరించనున్నారు.



బసవన్న తొలి జాతీయ జయంతి

జాతీయ స్థాయిలో మొదటి సారి నిర్వహించనున్న ప్రముఖ కన్నడ రచయిత గురు బసవన్న జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు బసవ సమితి బుధవారం ఇక్కడి కన్నడ భవనలో వివరాలను వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top