నేడే మార్స్ కక్ష్యలోకి మామ్!

నేడే మార్స్ కక్ష్యలోకి మామ్!


చరిత్రాత్మక విజయం అంచున భారత్

ఉదయం 7:17 గంటలకు మామ్ అంగారక కక్ష్యా ప్రవేశం

8:15 గంటలకు భూమికి అందనున్న సమాచారం


 

బెంగళూరు: భారత మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్‌యాన్) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించే చరిత్రాత్మక ఘట్టం నేడే. తొలి ప్రయత్నంలోనే అంగారక యాత్రా విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ చరిత్రాత్మక విజయం నమోదు చేసేదీ నేడే. సోమవారం అంగారకుడి గురుత్వ ప్రభావ క్షేత్రంలోకి ప్రవేశించిన మామ్ సరిగ్గా బుధవారం ఉదయం 7:17:32 గంటలకు మార్స్ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు ఉపగ్రహాన్ని  కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉదయం 8:15 గంటల కల్లా మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహ ప్రవేశం గురించిన సమాచారం అందుతుందని, మధ్యాహ్నం కల్లా ఉపగ్రహం అంగారకుడి కలర్ ఫొటోలను భూమికి పంపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ కక్ష్యలోకి మామ్ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమం ఉదయం 6:45 గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌లో, దూరదర్శన్‌లో ప్రసారం కానుందన్నారు.



అంగారక కక్ష్యా ప్రవేశం ఇలా: ఉపగ్రహంలోని మీడియం గెయిన్ యాంటెన్నాను ఆన్ చేయడంతో తెల్లవారుజామున 4:17 గంటలకు కుజుడి కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 6:57 గంటలకు ఉపగ్రహాన్ని అంగారకుడి వైపు మళ్లేలా తిప్పుతారు. సరిగ్గా 7:17:32 గంటల నుంచి 7:41 గంటల వరకూ ప్రధాన ద్రవ అపోజీ మోటారు(లామ్) ఇంజిన్ మండేలా ఆదేశాలు ఇస్తారు. ఈ ప్రక్రియకు 250 కిలోల ఇంధనాన్ని ఉపగ్రహం వినియోగించుకుంటుంది. లామ్ ఇంజిన్ మండటానికి ఐదు నిమిషాలకు ముందే 7:12 గంటలకు ఉపగ్రహం అంగారకుడికి ఆవలి వైపు వెళుతుంది. దీనివల్ల భూమితో సంబంధాలు తెగిపోతాయి. మార్స్‌కు ఆవలివైపు.. 7.53 గంటల వరకూ ఉపగ్రహం మార్స్ నీడలోనే సాగుతుంది. ఈ సమయంలో ఉపగ్రహానికి చెందిన టెలీమెట్రీ(రేడియో) సంకేతాలను భూమి మీద ఉన్న నెట్‌వర్కింగ్ కేంద్రాలు అందుకోలేవు. అందువల్ల మార్స్‌కు ఆవలి వైపు ఉన్నంతసేపూ ఉపగ్రహం జాడ తెలియదు. అలాగే ప్రధాన లామ్ ఇంజిన్ మండకపోతే గనక.. ప్రత్యామ్నాయంగా ఉన్న ఎనిమిది చిన్న థ్రస్టర్లు మండేలా ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగానే ఆదేశాలు ఇస్తున్నారు. ఉపగ్రహం మార్స్ కక్ష్యలోకి ప్రవేశించి నీడలోంచి వెలుపలికి, భూమి వైపుగా వచ్చిన తర్వాత తిరిగి భూమితో సంబంధాలు ఏర్పడతాయి. అంగారకుడు ప్రస్తుతం 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున.. మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పడుతుంది.



అందువల్ల 8:15 గంటలకే  ఉపగ్రహం నుంచి తిరిగి సంకేతాలు భూమికి అందుతాయి. దీంతో ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలోకి చేరిన విషయం నిర్ధారణ అవుతుంది. మార్స్ కక్ష్యలో ఉపగ్రహాన్ని పర్యవేక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ‘ఇస్ట్రాక్’తో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలలో గల డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. మార్స్ కక్ష్యలోకి సోమవారమే ‘మావెన్’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన  నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు.. ఇస్రోకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘గుడ్‌లక్ మామ్! ఫ్రం యువర్ జేపీఎల్ ఫ్యామిలీ!’ అని పేర్కొంటూ సందేశం పంపారు. మార్స్ కక్ష్యలోకి చేరుతున్న ప్రత్యక్ష ప్రసారాలను విద్యార్థులు చూసేందుకువీలుగా ఏర్పాట్లు చేయాలని తన అనుబంధ స్కూళ్ల ప్రిన్సిపల్స్‌కు సీబీఎస్‌ఈ సూచించింది.

 

అద్భుత ఘట్టాన్ని వీక్షించనున్న ప్రధాని


 

బెంగళూరు: అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించే అద్భుత ఘట్టాన్ని బెంగళూరు శివారులోని ‘ఇస్ట్రాక్’లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. ఇందుకుగాను ప్రధాని ఉదయం 6.45 గంటలకు ఇస్ట్రాక్‌కు చేరుకుంటారు. అంతరిక్ష శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ప్రధాని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరులో అతిపెద్ద ఫుడ్ పార్కును ప్రారంభించిన తర్వాత బుధవారం మధ్యాహ్నం ప్రధాని తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top