నేపాల్లో భూకంపం: 1500 మంది మృతి


ఖాట్మాండ్: భారీ భూకంపం నేపాల్ను అతలాకుతలం చేసింది. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం 1500 మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులో 600 మందికి పైగా, భక్తపూర్లో 144 మంది, లలిత్పూర్లో 68 మంది మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, సరిగ్గా ఎంతమంది మరణించారన్న విషయాన్ని తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భూప్రకంపనలతో నేపాల్లోని పురాతన భవనాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు గృహ సముదాయాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. (బీహార్ లో 35 మంది, యూపీలో 12 మంది మృతి)




 నేపాల్ కేంద్రంగా ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.  రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.1గా నమోదైంది.  నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు గాయపడినవారు పెద్ద ఎత్తున ఖాట్మాండ్లోని ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పాత ఖాట్మాండ్లోని హన్మాన్ డోక ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, నేపాల్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.


నేపాల్ రాజధాని ఖట్మాండ్తో సహా ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది.  భూ ప్రకంపనల ధాటికి ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్ సేవలు నిలిచిపోయాయి.  నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.




భారత ప్రభుత్వం నేపాల్కు సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉత్తర,  ఈశాన్య భారతంలో  సంభవించిన భూకంపం ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.  భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. నేపాల్లో  భూంకంప పరిస్థితిని  కూడా గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్, నేపాల్లో సంభవించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  విపత్తునివారణ సంస్థను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  భూకంప తీవ్రతపై అధికారులతో చర్చించారు. భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. భూప్రకంపనల వల్ల బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మరణించారు. పశ్చమబెంగాల్లో మరొకరు చనిపోయారు.



ఉత్తర భారతదేశంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు యాత్రను నిలిపివేశారు. భూకంపం వల్ల ఉత్తరాఖండ్లోనూ భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం మీద చిక్కుకుపోయారు. నేపాల్, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.




ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో  భూమి స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  దాంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.   హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన 28 మంది యాత్రికులు  /ఖాట్మండులో చిక్కుకున్నారు. వారం రోజుల క్రితం వారు సాయిబాబా ట్రావెల్స్ ద్వారా  ఖాట్మండ్ వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో వారు చిక్కుకున్నారు. 










 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top