మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు

మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు


చెన్నై బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు

పార్థివదేహాన్ని కడసారి దర్శించుకున్న పలువురు ప్రముఖులు


 

 చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ పార్థివదేహానికి చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కాలేయ సంబంధ అనారోగ్యంతో 45 ఏళ్ల పిన్నవయసులోనే కన్నుమూయడం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూడడానికి పలువురు సినీకళాకారులు, సంగీత కళాకారులు, ఇతర ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు. పిన్నవయసులోనే కానరాని లోకాలకు తరలిపోయిన ఆయన్ను తలుచుకుని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.

 

  ‘నిజానికి ఉప్పలపు శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియదు. మాండలిన్ శ్రీనివాస్ అంటే ప్రపంచమే గౌరవిస్తుంది. అంతటి ఘనకీర్తి, కిరీటాలు పొందిన శ్రీనివాస్ పిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మాండలిన్ శ్రీనివాస్ మరణం దేశంలోని సంగీత కళాకారులందరి మనసులను కలచివేసింది’ అంటూ ఆయన్ను స్మరించుకున్నారు. శ్రీనివాస్‌కు నివాళులర్పించిన వారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరిహరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు.

 

 రాష్ట్రపతి సంతాపం

 మాండలిన్ శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ వర్గాలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీనివాస్ సోదరుడు రాజేష్ పేరిట రాసిన లేఖలో ‘‘మీ సోదరుడు శ్రీనివాస్ మృతి వార్త విని చాలా బాధపడ్డాను’’ అని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో తన కచేరీలద్వారా దేశంతోపాటు విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారని, ఆయన మృతితో ఓ గొప్ప మాండలిన్ విద్వాంసుడిని కోల్పోయిందని రాష్ట్రపతి అన్నారు. శ్రీనివాస్ కుటుంబీకులకు సానుభూతి తెలియజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top