ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్

ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి అదే కారులో కూర్చుని అరవడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయాణికుడిని దిగాల్సిందిగా కోరినా.. అతడు వినలేదు. దాంతో ఏమీ చేయలేక అతడిని కూడా ఆ బ్యాటరీ కారులో తీసుకెళ్లారు. నితీష్ కుమార్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా, రెండో ప్రయాణికుడు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు.



ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కలేటర్లు, వాకలేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, వీఐపీలను మాత్రం గోల్ఫ్ కార్ట్ తరహా బ్యాటరీ కార్లలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు తీసుకెళ్తారు. అలాంటివి మొత్తం 30 కార్లు ఉన్నాయి. ముంబై నుంచి నితీష్ వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 310లోనే వచ్చిన ఆ ప్రయాణికుడు.. నేరుగా వచ్చి నితీష్ ఎదురుసీట్లో కూర్చుండిపోయాడు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీగానే చూస్తారు. వాళ్లకు వ్యక్తిగత భద్రత కల్పిస్తారు. నితీష్‌తో పాటు బ్యాటరీ కారులో కూర్చున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి హాని కల్పించకపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించకపోవడంతో తాము కూడా మరీ బలవంతం చేయలేదని, ముఖ్యమంత్రి సైతం ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయలేదని విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు చూసే సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి.



ఒకవైపు వీఐపీ సంస్కృతి వద్దంటూ మంత్రులు, ఇతరుల కార్లమీద ఎర్రబుగ్గలు తీసేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే.. మరోవైపు విమానాశ్రయాలలో మాత్రం ఇలా కొంతమందిని ప్రత్యేకంగా చూడటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు నడవలేనివాళ్లు, వృద్ధులు, రోగులకైతే పర్వాలేదు గానీ అంతా బాగానే ఉన్నవారికి ప్రత్యేకంగా ఇలా గోల్ఫ్ కార్టులు కల్పించడం ఎందుకన్న వాదనలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top