నా పేరు ముకేశ్.. నాకు బ్రెస్ట్ కేన్సర్!

నా పేరు ముకేశ్.. నాకు బ్రెస్ట్ కేన్సర్!


ముకేశ్ (పేరు మార్చాం).

నగరంలోని ఓ బిజినెస్ మ్యాన్..

బిందాస్ లైఫ్..

ఉదయమంతా ఆఫీసులో పని..

సాయంత్రమయ్యేసరికి బార్లో మందు.. ఇంకేం కావాలి..

ముకేశ్‌కిప్పుడు 43 ఏళ్లు..

కొన్ని నెలల క్రితం అతనో విషయాన్ని గమనించాడు..

తన రొమ్ముల్లో ఒకటి మరోదానితో పోలిస్తే.. పెద్దగా మారింది..

ఆ ప్రదేశంలోని చర్మం నారింజ రంగులోకి మారింది.. ఎందుకైనా మంచిదని డాక్టర్‌ను కలిశాడు..

‘మీకు బ్రెస్ట్ కేన్సర్’ డాక్టర్ చెప్పాడు..

ముకేశ్‌కు షాక్..

నాకు రొమ్ము కేన్సరా?

మగాళ్లకు రొమ్ము కేన్సరా?




► దేశంలోపెరుగుతున్న పురుష రొమ్ము కేన్సర్ కేసులు

► ప్రతి 400 మందిలో ఒకరికి వచ్చే అవకాశం..

► అవగాహన పెంచడం అవసరమంటున్న వైద్యులు..




ఎంబీసీ.. మేల్ బ్రెస్ట్ కేన్సర్.. దేశంలో ప్రస్తుతమీ కేసులు పెరుగుతున్నాయి. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ కేన్సర్‌పై మీడియాలోనూ విస్తృతంగా రావడంతో దీనిపై అవగాహన బాగా పెరిగింది. ఎంబీసీ విషయంలో అలాంటిది ఉండటం లేదు. పైగా.. పురుషులకు రొమ్ము కేన్సర్ వస్తుందన్న అంశంపై చాలా మందిలో అవగాహన లేకపోవడంతో ఇది చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముకేశ్ తొలి దశలోనే వైద్యుల వద్దకు రావడంతో సరైన చికిత్స తీసుకుని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ.. చాలా మంది పురుషుల విషయంలో పరిస్థితిలా ఉండటం లేదు. ‘బ్రె స్ట్ కేన్సర్ మగాళ్లకు వస్తుందన్న విషయాన్ని వారు నమ్మరు. లక్షణాలను బట్టి.. ఒకవేళ అనుమానం వచ్చినా.. ఎవరేమంటారన్న భయంతో మిన్నకుండిపోతారు. దీంతో చివరకు మా వద్దకు వచ్చేసరికే పరిస్థితి చేయి దాటిపోతుంది. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరముంది’ అని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ అంకాలజిస్ట్ డాక్టర్ వికాస్ గోస్వామి అన్నారు.

 

లక్షణాలివీ..

రొమ్ము కణజాలం గట్టిపడటంతోపాటు గడ్డలా మారడం..

కొంత కాలానికి అది పెరిగి.. నొప్పి రావడం..  రొమ్ము ప్రాంతంలోని చర్మం నారింజ రంగులోకి మారడం.. ముడతలు పడటం..

చనుమొనలు పెద్దవి కావడం.. వాటి నుంచి ద్రవం కారడం..

 

ఎందుకు వస్తుంది?

కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. కుటుంబంలో ఎవరికైనా గతంలో రొమ్ము కేన్సర్ వచ్చి ఉండటం, అతిగా తాగడం, కాలేయ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, రేడియేషన్, ప్రమాదకర రసాయనాల ప్రభావానికి గురికావడం, జన్యువుల్లో లోపం వంటి వాటి వల్ల ఇది రావొచ్చని చెబుతున్నారు.



ఎంత మందికి?

కొన్ని అధ్యయనాల ప్రకా రం దేశంలో ప్రతి 30 మంది మహిళల్లో ఒకరికి తమ జీవిత కాలంలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశముండగా.. పురుషుల్లో ప్రతి 400 మందిలో ఒకరికి వచ్చే అవకాశముంది. వీరి విషయంలో బతికే అవకాశాలు 73 శాతం మాత్రమే! ఎందుకంటే.. అసలు ఇలాంటిది ఒకటి తమకు వస్తుందన్న విషయం తెలియకపోవడం వల్ల మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఇది ముదిరిపోయిన తర్వాతే గుర్తించడం జరుగుతుంది. దీని వల్ల చికిత్స కూడా ఆలస్యంగా ప్రారంభమవుతుంది. దీనికితోడు స్త్రీలతో పోలిస్తే.. పురుషుల్లో రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది. ఇది గట్టిపడినా.. వెంటనే గుర్తించడం కొంచెం కష్టమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top