సచిన్ స్ఫూర్తితో సివిల్స్ ర్యాంక్

సచిన్ స్ఫూర్తితో సివిల్స్ ర్యాంక్


ముంబై: ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్నూ ప్రభావితం చేస్తున్నాడు. పట్టుమని పదోతరగతి కూడా పాస్ కాలేని (పాక్తో సిరీస్ కారణంగా పరీక్షలకు హాజరుకాలేదు) సచిన్.. దేశంలోనే అత్యున్నతమైనదిగా భావించే సివిల్స్కు.. ఆ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించేవారికి స్ఫూర్తిగా నిలిచాడు. మూడు రోజుల క్రితం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మహారాష్ట్ర టాపర్గా నిలిచిన ఇబోలి నర్వాణే తన ఉన్నతికి కారణం క్రికెట్ దేవుడేనని గర్వంగా చెబుతోంది.



పుణెలో స్కూలింగ్ పూర్తిచేసిన ఇబోలి.. ముంబైలోని ప్రముఖ కాలేజీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్) పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో సివిల్స్ ఆలిండియా 78వ ర్యాంక్ సాధించింది. చిన్నప్పటినుంచి సచిన్కు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఇబోలి ఏమాత్రం సమయం చిక్కినా క్రికెట్ దేవుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని తిరగేస్తూ, ఆయన ఆడిన అద్భుత ఇన్నింగ్సులు చూస్తుంటుంది. సచిన్ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాడని ప్రశ్నిస్తే..



'ప్రధానంగా మూడు విషయాల్లో టెండూల్కర్ నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు. ఒకటి ఆట పట్ల అతను చూపే కమిట్మెంట్. రెండు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణం. మూడు దేశం కోసం ఇవ్వగలిగిందంతా ఇచ్చేయడం. ఈ మూడు అంశాలన్ని ఎప్పుడూ బేరీజు వేసుకుంటాను. సచిన్లా నేనూ కమిట్మెంట్తో ఉన్నానా? ఆయనకు మల్లే దేశంకోసం నేనేదైనా చేయగలనా? అని ప్రతిక్షణం ఆలోచిస్తూఉంటాను. ఆ ఆలోచనలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. ఐఏఎస్ ఆఫీసర్గా భవిష్యత్లో సాధించబోయే విజయాల్లో కూడా సచిన్ స్ఫూర్తి తప్పక వుంటుంది' అని సమాధానమిస్తోంది.



సివిల్స్లో సత్తాచాటిన ఇబోబి ప్రొఫెషనల్ కథక్ డ్యాన్సర్ కూడా. కాలేజీలో, ఆతర్వాతా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తల్లి మీనల్ నర్వాణే ప్రఖ్యాత యశ్వాడా అకాడమీ డైరెక్టర్. తండ్రి సునీల్ నర్వాణే మర్చంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె మేనమామ రాజీవ్ రణడే ఐఆర్ఎస్ ఆఫీసర్. తన విజయంలో సహోదరి నేహా కులకర్ణీ పాత్రకూడా ఉందటోంది ఇబోబి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top