రాకాసి కొండలు

రాకాసి కొండలు


రెయిన్ టై

ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కొండచరియలు

ప్రతీఏడాది వర్షాకాలంలో చోటుచేసుకుంటున్న ఘటనలు

తాజాగా పుణే జిల్లోలోని మాలిన్ ఊరంతా సమాధి

శాశ్వత పరిష్కారంచూపని ముంబై కార్పొరేషన్, ప్రభుత్వాలు

సాక్షి, ముంబై : కొండచరియలు ప్రజల ప్రాణాలను కబలిస్తున్నాయి. ఇది ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రతిఏటా వర్షాకాలంలో ఈ దుస్థితి దాపురిస్తోంది. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పించుకోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముంబై పరిసరాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొండ చరియ కింద ఉన్న మాలిన్ అనే ఊరు ఊరంతా సమాధి అయ్యింది. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నా శాశ్వత నివారణ చర్యలకు ముంబై కార్పొరేషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేదని ముంబైతోపాటు, పరిసర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటి వరకూ.. వందాలాది మంది మృతి

ఇప్పటి వరకూ కొండచరియలు విరిగిపడడంతో వందాలాది మంది మృతి చెందారు. 2000 జూలై 13 ఘాట్కోపర్‌లో కొండచరియలు విరిడిపడడంతో 67 మంది మరణించారు. 2009 సెప్టెంబరు నాలుగవ తేదీ సాకినాకాలో కొండచరియలు విరిగిపడి 12 మంది మరణించారు. 2012 సెప్టెంబరు 3 తేదీ చెంబూర్‌లో కొండచరియలు విరిగిపడినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. 2013 జూలై 19వ తేదీ అంటప్‌హిల్‌లో జరిగిన సంఘటనలో 5 మంది మృతిచెందారు.



తాజాగా పుణే జిల్లాలో మాలిన్ గ్రామం కూడా ఈ దుస్సంఘటనలో గురువారం నమోదు అయ్యింది. చెంబూర్‌లో కొండచరియలు విరిగిపడి ఓ అయిదేళ్లుబాలుడు మరణించాడు.  ప్రస్తుతం కొండచరియల పరిసరాల్లో నివసించే ముంబైవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో పుణే జిల్లా మాలిన్ గ్రామంలాంటి ప్రమాదం జరిగితే నగరంలో కూడా భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన కార్పొరేషన్ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు.

 

గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు ఇవే..


ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిసాస్టర్ కంట్రోల్  నుంచి అందిన వివరాల మేరకు ముంబైలో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు ఏర్పడే అవకాశాలున్న ప్రాంతాలు 263 ఉన్నాయి. వీటిలో ‘ఎస్’ విభాగంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ ‘ఎస్’ విభాగంలో ఏకంగా 145 ప్రమాదకరమైన కొండచరియ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారు. ‘ఎన్’ విభాగంలో 30 ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 645 మంది నివసిస్తున్నారు. ఇక ‘డి’ విభాగంలో కొండచరియలు విరిగిపడే  ప్రమాదం ఉన్న ప్రాంతాలు 16 ఉన్నాయి.



మరో ‘వెపు ‘ఎల్’ విభాగంలో 15, ‘ఈస్ట్ ఎస్’,  ‘నార్త్ పి’లలో పదేసి ప్రమాదకరమైన ప్రాంతాలున్నాయి. ఇలా మొత్తం 19 విభాగాలల్లో ఇలాంటి ప్రాంతాలున్నాయి. గత వారంపది రోజులుగా ముంబైతోపాటు చుట్టుపక్కల పరిసరాలల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా బీఎంసీ కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నోటీసు అందించి చేతులు దులుపుకుంటుందా..? లేదా వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటుందా అనేది వేచిచూడాల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top