కాషాయ బంధం నిలిచింది!

కాషాయ బంధం నిలిచింది! - Sakshi


శివసేన, బీజేపీ పొత్తు ఓకే

శివసేనకు 151, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7 సీట్లు ఇచ్చేలా కుదిరిన అవగాహన


 

ముంబై/న్యూఢిల్లీ: పాతికేళ్ల బంధం నిలబడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును కొనసాగించాలని బీజేపీ, శివసేనలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు పార్టీల రాష్ట్రస్థాయి నేతలు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల పంపకానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనపై చర్చ జరిపామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ నేత వినోద్ తావ్దే తెలిపారు. ఆ ప్రతిపాదన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రతిపాదనలో.. బీజేపీకి 130 స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే సమయంలో తాము మొదట్నుంచీ చెబుతున్నట్లుగా 151 సీట్లలో సేన పోటీ చేస్తుంది. బీజేపీకి పెరిగే సీట్ల మేరకు మహాకూటమి(మహాయుతి)లోని ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తారు. కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్పీఐ(అథవలే), రాష్ట్రీయ సమాజ్‌పక్ష్, స్వాభిమాని షేత్కారీ పక్ష్, శివ్ సంగ్రామ్‌లతో ఈ ప్రతిపాదనపై చర్చించి, వాటి ఆమోదం తరువాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పై ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ మిత్రపక్షాలకు 7 స్థానాలు మాత్రమే మిగుల్తాయి. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెప్పడం, కనీసం 130 సీట్లు కావల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే.



ప్రజలు కోరుకుంటున్నారు: ఉద్ధవ్



మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను పక్షం రోజుల క్రితం బహిరంగంగా వెల్లడించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అది ప్రజల ఆకాంక్షేనంటూ మంగళవారం మాట మార్చారు.



కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు అసంపూర్ణం



కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారిక నివాసంలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో 124 స్థానాల్లో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్సీపీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 144 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, ఎన్సీపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top