కార్టూన్ వేశారని.. పత్రికా కార్యాలయాలపై దాడి

కార్టూన్ వేశారని.. పత్రికా కార్యాలయాలపై దాడి - Sakshi


మహారాష్ట్రలో ప్రాచుర్యం పొందిన లోక్‌మత్ దినపత్రిక కార్యాలయాలపై ముస్లిం గ్రూపులు దాడిచేసి అక్కడి అద్దాలు పగలగొట్టాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు నిధులు ఎలా వస్తున్నాయన్న కథనానికి పిగ్గీబ్యాంక్ కార్టూన్ వాడినందుకు ఆగ్రహం, అసహనంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్, ధూలే, నండూర్‌బార్, మాలెగావ్ నగరాల్లోని లోక్‌మత్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కార్యాలయాల మీద రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. దాంతోపాటు కార్టూనిస్టు మీద, పత్రిక సంపాదకుడి మీద పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు జలగావ్ ఎంఐడీసీ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కురాహదే తెలిపారు. లోక్‌మత్ కార్యాలయాలన్నింటికీ పోలీసు భద్రత కల్పించారు.



దాడి నేపథ్యంలో, బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ పత్రిక ఒక క్షమాపణను ప్రచురించింది. అయితే, ప్రముఖ కాలమిస్టు అనిల్ ధర్కర్ మాత్రం ఈ దాడిని ఖండించారు. కార్టూన్ వేసినంత మాత్రాన తప్పేమీ లేదని.. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా డబ్బును చూపించడానికి పిగ్గీబ్యాంకు బొమ్మలు వాడటం సర్వసాధారణమని ఆయన అన్నారు. సాధారణంగా తమకు ఏమైనా అసంతృప్తి ఉంటే పాఠకులు సంపాదకులకు లేఖ రాస్తారని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అసహనం హద్దులు దాటుతుందని ఆయన అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top