కల్నల్ మహాదిక్‌కు కన్నీటి వీడ్కోలు


సతారా: ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ మహాదిక్ అంత్యక్రియలు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. దేశ రక్షణలో ప్రాణాలు విడిచిన ఆయనకు కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తోపాటు ఆర్మీ అధికారులు, ఆయన గ్రామస్తులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. 41 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారిగా ఉన్న 38 ఏళ్ల మహాదిక్‌ జమ్ముకశ్మీర్‌లోని కుప్పారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఎల్‌వోసీ వద్ద ఉగ్రవాదులను తరుముతూ వెళ్లిన సైనిక బృందానికి నేతృత్వం వహించిన ఆయన ఎదురుకాల్పుల్లో తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకపోయిందని, బుల్లెట్ గాయాలతో ఆయన తుదిశ్వాస విడిచారని ఆర్మీ అధికారులు తెలిపారు.



విశిష్ఠమైన పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి అయిన కల్నల్ సంతోహ్ మహదిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదులు దాగున్న ప్రదేశాల్లోకి వెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన సాహసం ఆయనది. 2003లో ఈశాన్య భారతంలో నిర్వహించిన ఆపరేషన్ రినోకు గాను ఆయనకు సేనా శౌర్య పతకం లభించింది. కల్నల్‌ గా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఆయన సాహసోపేత ఆపరేషన్లను ఆపలేదు. జమ్ముకశ్మీర్‌లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఆర్మీ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగమైన రాష్ట్రీయా రైఫిల్స్ బెటాలియన్‌కు ఆయన నేతృత్వం వహించారు. మహారాష్ట్ర సతరాలోని సైనిక స్కూల్‌లో చదవి ఆర్మీలో చేరిన కల్నల్‌ మహాదిక్‌కు భార్య సరస్వతి, 11 ఏళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top