మరోసారి భూ ఆర్డినెన్స్!!


భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై వెనుకడుగువేయబోమని ప్రకటించిన దరిమిలా ఆ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ బిల్లుపై రెండుసార్లు ఆర్డినెన్స్ జారీ అయ్యాయి. అయితే జూన్ 3తో గడువు ముగుస్తుండటంతో మరోసారి ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.  



ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసం 7 రేస్ కోర్స్ లో శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భూ సేకరణ చట్టం సవరణ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు పంపాలని తీర్మానించింది.



భూ బిల్లుపై ఏర్పాటయిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ తొలి సమావేశంలోనూ విసక్ష సభ్యులు  ప్రభుత్వం తీరును ఎండగట్టారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేడీ, టీఎంసీ సహా లెఫ్ట్ పార్టీలకు చెందిన సంభ్యులు హాజరయ్యారు. వారికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, న్యాయశాఖలకు చెందిన అధికారులు బిల్లులోని సవరణలపై వివరించారు.



2013లో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏదేనీ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించాల్సి వచ్చినప్పుడు కనీసం 70 నుంచి 80 శాతం రైతులు అందుకు అంగీకరించడం తప్పనిసరి. అయితే ఈ నిర్ణయంవల్ల పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని భావించిన ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేసి,  రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం వీగిపోయిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top