హేమమాలిని బుగ్గల కంటే నున్నగా...

హేమమాలిని బుగ్గల కంటే నున్నగా... - Sakshi

భారత రాజకీయాల్లో చాలా సున్నితమైన అంశాలను సీరియస్ గా .. సీరియస్ అంశాలను వినోదాత్మకంగా మలచడంలో  మన నాయకులకు సాటి ఎవ్వరూ ఉండరు. అయితే సెన్సిటివ్ అంశాలను సీరియస్ గా మార్చడం కొందరు రాజకీయ నాయకులు సాధ్యమైతే.. సీరియస్ అంశాలకు హ్యూమర్ జోడించి తేలిక పర్చడం మరి కొందరికి మాత్రమే సాధ్యం. కాని భారత రాజకీయాల్లో ఈ రెండింటిని సాధ్యం చేసే సత్తా ఉన్న నేత కేవలం రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కే సాధ్యమనడంలో సందేహం అక్కర్లేదు. మీడియా సమావేశం కాని.. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కాని, సమయమేదైనా కాని.. సందర్భం ఎలాంటిదైనా...తన మార్క్ కామెడి.. తనదైన శైలితో ప్రతిపక్ష నేతలపై లాలూ దాడికి దిగడం లాంటి అంశాలు భారత ప్రజలను ఆకర్షిస్తునే ఉన్నాయి. 

 

అందుకు ఉదహరణగా ఓ సంఘటన ప్రస్తావించాల్సిందే. బీహార్ రోడ్లన్ని గతుకులమయం అయ్యాయని ఓ విలేకరి ప్రశ్నించిన సందర్భంలో.. బీహార్ రోడ్లన్ని హేమామాలిని బుగ్గల కంటే చాలా నున్నగా ఉన్నాయని ( బీహార్ రోడ్స్ ఆర్ బెటర్ దాన్ హేమామాలిని చీక్స్ ) లాలూ భాయ్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో మీడియా వారికే కాదు.. ప్రజలకు కూడా హాస్యాన్ని పంచడంలో లాలూది ఓ ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. అంతేకాక.. ఓసారి ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోందటగా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. బీహార్ లో ఆలూ ఉన్నంత కాలం.. లాలూ రాజకీయాల్లో ఉంటాడు (జబ్ తక్ బీహార్ మే ఆలూ.. తబ్ తక్ లాలూ) అని చమత్కరించారు. 

 

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ రధ యాత్రను బీహార్ లో అడ్డుకోవడం ద్వారా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ .. ఆతర్వాత ఢిల్లీలో ప్రభావవంతమైన రాజకీయాలను నడిపించడంలో లాలూ పెద్ద పాత్రే పోషించారు. అయితే ఆతర్వాత పశుగ్రాస కుంభకోణం, లెక్కకు మించిన ఆస్తుల్లాంటి కేసు లాలూని వెంటాడంతో ఆయన ప్రభావం క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఆతర్వాత రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో అనూహ్యంగా తన భార్య రబ్రీదేవిని పీఠంపై కూర్చోబెట్టి రాజకీయ నేతలకు గట్టి షాకే ఇచ్చారు.  ఆ తర్వాత  లాలూ ప్రభావం ఎంతగా పడిపోయిందనే విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తే.. ఓ దశలో సోనియా గాంధీని తనదైన మార్క్ తో రఫ్ ఆడించారు.. కాని అధికారం కోల్పోయిన లాలూ చివరకు సోనియా కనుసన్నళ్లో రాజకీయ జీవితం గడపాల్సి వస్తోంది. బీహార్ లో నితీష్ ప్రభుత్వానికి ఎదురు లేకపోవడం... లాలూ పుంజుకోకపోవడం లాంటి అంశాలు అధికారానికి దూరంగా ఉంచాయి. 

 

అయితే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ శతవిధాలా ప్రయత్నిస్తునే ఉన్నారు. ప్రస్తుతం జరుగబోయే.. జరుగుతున్న ఎన్నికలు లాలూకు అగ్నిపరీక్షగానే నిలిచాయి. లాలూ తిరిగి పూర్వ వైభావాన్ని నిలబెట్టుకుంటారా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే అయినా..  కొద్ది రోజులాగితే లాలూ జాతకం ఎంటో స్పష్టమవ్వడం ఖాయమే. లాలూ అధికారాన్ని చేజిక్కించుకుంటారో లేదో..కాని ఆయన మార్క్ రాజకీయాలకు మాత్రం  బీహార్ లో ఆలూ ఉన్నంత కాలం ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top