'జయ మృతి విచారణకు కరుణించిన వెంకన్న'

వినతిపత్రం సమర్పిస్తున్న కేతిరెడ్డి (ఫైల్)


చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. జయ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని గతంలో చెన్నై నుంచి తిరుమల వచ్చి ర్యాలీ నిర్వహించిన కేతిరెడ్డి అనంతరం వెంకటేశ్వర స్వామికి వినతిపత్రంతో పాటు మొక్కులు సమర్పించుకున్నారు.


పళనిస్వామి నిర్ణయానికి మద్ధతు తెలిపిన ఆయన శనివారం మరోసారి తిరుమలకు వెళ్లి మొక్కులు సమర్పించుకోనున్నారు. వెంకన్న స్వామి కరుణించినందువల్లే విచారణ ప్రారంభం కానుందని, అమ్మ మృతికి కారణాలు నెగ్గుతేలాలని ఆకాంక్షించారు. జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోదీని గతంలో కలిసి సీబీఐ విచారణ కోసం విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జయ మృతిపై గతంలో సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం ఎలాంటి విచారణకు మొగ్గుచూపలేదని, పదవికి రాజీనామా చేసిన తర్వాత జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో అమ్మ వీరవిధేయుడే ఆమె మృతిపై నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో అన్నాడీఎంకేపై ప్రజలు నమ్మకం కోల్పోయినట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ మద్ధతుతోనే జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అందుకు కారణమైన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.



దాదాపు 70 రోజులకు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్‌ 5న హఠాత్తుగా జయ మృతి చెందగా, దీని వెనుక ఆమె సన్నిహితురాలు శశికళ కుట్ర జరిగి ఉండొచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. జయకు ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి, వీఐపీలను కలవనీయకపోవడం, అక్కడ సీసీటీవీలు లేకపోవడంపై ఆమె మృతిపై సందేహాలున్నాయని సీబీఐ విచారణ జరిపించాలని అదే నెల 14న సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆమె మృతిపై నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొంటూ.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గతంలో ఆయన ధర్నా చేపట్టారు. సీబీఐ విచారణ కోసం మద్ధతు తెలపాలని కోరుతూ ఎంపీలందరికీ వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.



గతంలో జయపై విష ప్రయోగం జరగడంపై, పోయెస్ గార్డెన్‌లో అమ్మపై కుట్రలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. విష ప్రయోగం తర్వాత శశికళను జయ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టడం.. ఆపై కొన్ని రోజుల తర్వాత పథకం ప్రకారం పోయెస్ గార్డెన్‌లో శశికళ అడుగెపెట్టారని ఆరోపణలున్నాయి. జయలలిత జైలులో ఉండగా అన్నాడీఎంకే నేత నామినేషన్ పత్రాలపై వేసిన వేలిముద్రలు అమ్మవి కాదని, శశికళవని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ నియామకం చెల్లదంటూ ఇటీవల సీఎం పళనిస్వామి శిబిరం తేల్చడం, మరోవైపు అమ్మ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.



 తిరుమలలో తన మద్ధతుదారులతో కేతిరెడ్డి (ఫైల్)


సంబంధిత కథనం

జయలలిత మరణంపై న్యాయ విచారణ


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top