వాట్సాప్లో ఆ ఫోటోలు..అధికారి ఆత్మహత్య

వాట్సాప్లో ఆ ఫోటోలు..అధికారి ఆత్మహత్య - Sakshi


తిరువనంతపురం: సస్పెండ్ అయిన ఓ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలువురిని దిగ్ర్భాంతికి గురి చేసింది.   కేరళ రాష్ట్రం నడక్కావు లో  సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్  ఏపి షాజి(41) శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు దారి తీసింది. కాగా  షాజిని ఇటీవల  సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో  కొంతమంది మహిళలు, సీనియర్ పోలీసు అధికారుల  అభ్యంతరకర ఫోటోలను  షేర్ చేశాడనే అభియోగాలపై ఆయనపై ఈ చర్య తీసుకున్నారు.  



'అవర్ రెస్పాన్సిబిలిటీ  చిల్డ్రన్'  అనే వాట్సాప్ గ్రూప్లో   కొన్ని అశ్లీల, అభ్యంతరకమైన ఫోటోలు   ఇటీవల షేర్  అయ్యాయి.  అంతే..ఆ  ఫోటోలు  క్షణాల్లో  వైరల్ అయ్యాయి.   దీంతో  గ్రూపు అడ్మిన్గా వున్న రాజు మీనన్ దీనిపై  అధికారులకు ఫిర్యాదు  చేశాడు.    సీనియర్ పోలీసు అధికారులు,  ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తులతో కూడిన దాదాపు 90  మంది  ప్రముఖులు ఈ  గ్రూపులో  ఉన్నారు.  దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్గా మారింది.



అయితే తాను  కావాలని  ఆ పని చేయలేదని, ఎవరో పంపించిన ఫోటోలను చూస్తుండగా పొరపాటున వాట్సాప్లో  షేర్ అయ్యాయని వివరణ ఏపి షాజి యిచ్చాడు.  కానీ షాజి  సమాధానంపై  సంతృప్తి చెందని అధికారులు సీరియస్గా స్పందించి, సంఘటనపై విచారణకు ఆదేశించారు.  ప్రాథమిక విచారణ అనంతరం అసిస్టెంట్ కమిషనర్  సమర్పించిన నివేదిక ఆధారంగా సిటి  పోలీస్ కమిషనర్ షాజిని  తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు.  



 దీంతో మనస్థాపానికి గురైన షాజి  నిన్న సాయంత్రం తన నివాసంలో ఉరివేసుకొని  ఆత్మహత్యకు పాల్పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రశాంత్ జోక్యాన్ని ప్రశ్నిస్తూ స్థానికులు, ఉద్యోగులు శుక్రవారం అర్థరాత్రి వరకు ఆందోళన నిర్వహించారు.  సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.  కాగా  భార్య, ఇద్దరు కుమారులు ఉన్న షాజికి  బాల నేరస్తుల కేసులను డీల్ చేయడంలో మంచి పేరు ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top