‘నా భుజంపై వేరొకరి చేయి తప్పుకాదు​’

‘నా భుజంపై వేరొకరి చేయి తప్పుకాదు​’


తిరువనంతపురం: ప్రేమికుల దినోత్సవం రోజు వేధింపులకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటి ముందు ఉరేసుకొని కనిపించాడు. వీడియోలు తీసి తమను అవమానించడమే కాకుండా పోలీసులు నుంచి కూడా విపరీతమైన వేధింపుల ప్రశ్నలు రావడం వల్లే అతడు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని పలక్కాడ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రేమికుల దినోత్సవం రోజు కొల్లాం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ టాయిలెట్స్‌ వంటివి లేవు.



దీంతో తన ప్రియురాలు అక్కడే ఉన్న ఓ చెట్ల పొదల్లోకి వెళ్లి వ్యక్తిగత కారణాలతో వెళ్లగా ఆ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే స్వచ్చంద సంస్థ అంటూ చెప్పుకొచ్చిన కొంతమంది యువకులు ఆ యువతిని వేధించారు. ఇది గమనించిన ఆమె ప్రేమికుడు వారిని అడ్డుకోగా అతడిపై చేయి చేసుకున్నారు. అసలు పొదల్లో ఏం పని అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వారిద్దరిని కలిపి వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి నానా రచ్చ చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అల్లరి చేసిన వారిని అరెస్టు చేశారు. అయితే, అంతకుముందు బాధితులను హింసించే తీరుగా ప్రశ్నించారు.



ఈ విషయం అక్కడ ఇక్కడా తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేరుగా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈలోగా బాధిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం అనుమానం రేకెత్తిస్తోంది. ఇలాంటి నేరాలను ఏమాత్రం ఉపేక్షించరాదని మండిపడ్డారు. మరోపక్క, పోలీసులు కూడా దారుణాలకు దిగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.



ప్రేమికుల రోజు అయిపోయిన వారం రోజుల తర్వాత రాజా(24), స్వప్న(23)(పేర్లు మార్చాం) అనే ఇద్దరిని తిరువనంతపురం పార్క్‌లో పోలీసులు వేధించినట్లు తెలుస్తోంది. వారిద్దరు చనువుగా ఉన్నారని వేధించి, ప్రశ్నించి, వారికి పెద్ద మొత్తంలో ఫైన్‌ వేశారంట. దీనిపై స్వయంగా స్వప్ననే మీడియాకు చెబుతూ ‘వేరొకరి చేయి నా భుజంపై ఉండటం తప్పుకాదు.. చిన్నచిన్నవాటికే పోలీసులు ఇలా కేసులు పెడతామని బెదిరించే చర్యలు ఆగిపోవాలి. ఇలాంటి పనులకు ముగింపు పలకాలి’ అని చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top