అమిత్ షాకు ట్వీట్ చిక్కు

అమిత్ షాకు ట్వీట్ చిక్కు - Sakshi


న్యూఢిల్లీ: ఓనం పండుగ సందర్భంగా కేరళ పౌరులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ట్వీట్ వివాదాన్ని రేపింది. ఆయన ఓనం శుభాకాంక్షలు అని చెప్పడానికి బదులు వామన జయంతి శుభాకాంక్షలు అని చెప్పడంతో కేరళీయుల మనసును గాయపరిచినట్లయింది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. మొత్తం కేరళ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎందుకు వివాదం అయిందంటే కేరళలో ఓనం పండుగను మహాబలి త్యాగానికి గుర్తుగా చేసుకుంటారు.



మహాబలి అంటే మానవత్వానికి ప్రతీక అని, ఐకమత్యానికి చిహ్నం అని భావిస్తారు. అక్కడది అది రాష్ట్ర పండుగ కూడా. వామనావతారంలో విష్ణుమూర్తి పాతాళంలోకి బలిచక్రవర్తిని తొక్కేస్తాడు. అనంతరం అతడి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్‌ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారు. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటారు. పది రోజులపాటు ఇది జరుగుతుంది.



చివరి రోజున బలి రాకకోసం ఎదురుచూస్తూ ఆ రోజు మొత్తాన్ని ఆయనకు అంకితం చేసి భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకుంటారు. అలాంటి రోజున వామనుడి అవతారాన్ని ప్రశంసిస్తూ.. విష్ణు స్వరూపుడైన 'వామన జయంతి' అంటూ శుభాకాంక్షలతో అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది కేరళ వాసులకు ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం విజయన్ కూడా క్షమాపణలు డిమాండ్ చేసిన కొద్ది సేపటికే హ్యాపీ ఓనం అంటూ అమిత్ షా మరో ట్వీట్ చేయడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top