10 అడుగులు కదిలిన కఠ్మండు

10 అడుగులు కదిలిన కఠ్మండు


కఠ్మాండు: భారీ భూకంపం ధాటికి నేపాల్ రాజధాని కఠ్మాండు నగరం విలయాన్ని చవిచూడటమే కాదు.. ఏకంగా పది అడుగులు దక్షిణం వైపునకు కదిలిపోయిందని నిపుణులు వెల్లడించారు. కఠ్మాండు ఉన్న ప్రదేశమే దాని పాలిట శాపంగా మారిందని వారు చెబుతున్నారు. అదేవిధంగా భౌగోళిక పరిస్థితి దృష్ట్యా నేపాల్‌కు భూకంపాలు అనివార్యమని, ప్రతి 75 ఏళ్లకోసారి అక్కడ భూ విలయం జరిగే అవకాశముందని అంటున్నారు. నిపుణులు ఇంకా ఏమంటున్నారంటే...   ‘నాలుగు కోట్ల ఏళ్ల క్రితం భారత ఉపఖండం ఒక ప్రత్యేక ద్వీపం.



ప్రస్తుతం హిమాలయాలు ఉన్న ప్రదేశానికి దక్షిణాన ఐదు వేల కి.మీ. దూరంలో భారత్ ఉండేది. ఖండచలనం వల్ల భారత ఉపఖండం ఉన్న భూ ఉపరితలం(క్రస్ట్) భాగం కాలక్రమంలో ఆసియా వైపు కదిలింది. చివరికి ఇండియన్, యురేసియా టెక్టానిక్ ప్లేట్లు(భూ ఫలకాలు) రెండూ పరస్పరం ఢీకొన్నాయి. వాటి మధ్య ఢీ నేటికీ కొనసాగుతోంది’ అని అహ్మదాబాద్‌లోని భూకంప పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, అమెరికాలోని ‘జియోహజార్డ్స్ ఇంటర్‌నేషనల్’  సంస్థ నిపుణులు



వెల్లడించిన వివరాలు...

టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఉండటం వల్ల కఠ్మాండు సమీపంలోని భూభాగం తీవ్రంగా ప్రకంపనలకు గురి అయింది.

పురాతన కాలంలో సరస్సు ఉన్న చోటే ఇప్పుడు కఠ్మాండు ఉన్నందున భూకంపం ధాటికి ఆ మట్టిపొరలు సులభంగా కదిలాయి.

తాజా భూకంపం వల్ల మొత్తం నగరం దక్షిణం వైపుగా పది అడుగులు ముందుకు కదిలింది.

 

నేపాల్ కు భారీ వర్షాల ముప్పు

న్యూఢిల్లీ: భూకంప ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలతో పాటు మట్టి చరియలు జారిపడవచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కఠ్మాండుతో పాటు నేపాల్ తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. భారత్‌లో బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలకు ఆస్కారముందని తెలిపింది.

 

వారం క్రితమే కఠ్మాండుకు నిపుణులు

కఠ్మాండు: నేపాల్‌కు భారీ భూకంప ముప్పు ఉందని ముందే అంచనా వేసినందున.. భూకంపాన్ని ఎదుర్కోవడంలో అక్కడి పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్నది అధ్యయనం చేసేందుకుగాను 50 మంది అంతర్జాతీయ నిపుణులు వారం క్రితమే కఠ్మాండుకు చేరుకున్నారు. ‘ఎర్త్‌క్వేక్స్ వితౌట్ ఫ్రంటియర్స్’ గ్రూపునకు చెందిన వివిధ దేశాల భూకంప శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు వారిలో ఉన్నారు. రద్దీగా, ఇరుకిరుకు ఇళ్లలో నివసిస్తున్న నేపాల్‌లోని పేద ప్రజలను భూకంప సన్నద్ధులను చేయడంపై వారు చర్చలు జరిపారు. అయితే, ఇంతలోనే భూకంపం విలయం సృష్టించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top