చొరబాటుదారుల కాల్పుల్లో భారత జవాను మృతి


న్యూఢిల్లీ/జమ్మూ: మిలిటెంట్లుగా భావిస్తున్న కొందరు మంగళవారం తెల్లవారు జామున జమ్మూ జిల్లాలోని భారత్- పాక్ సరిహద్దు ద్వారా భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక భారత జవాను మరణించాడు. కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబటి జీరోలైన్ వద్ద సోమవారం రాత్రి మరో చొరబాటు యత్నం చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించి వారిపై కాల్పులు జరపడంతో.. చొరబాటుదారుల్లో ఒకరు చనిపోయారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆదివారం పాక్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్నియా, ఆర్‌ఎస్ పుర ప్రాంతాల్లోని 15 సరి హద్దు అవుట్‌పోస్ట్‌లపై, అంతర్జాతీయ సరిహద్దు దగ్గరలో ఉన్న పలు గ్రామాలపై పాక్ సైనికులు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఆరుగురు గాయపడగా, రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి.



ఈ ప్రభుత్వం తలవంచదు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ 19 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మంగళవారం ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అయితే, ప్రతీసారి వారికి భారత్ తగిన సమాధానమిచ్చిందని పేర్కొంది. ‘మేం తల వంచలేదు.. మనం తల వంచుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం రానీయదు’ అని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.



ఒకరికి పదిమంది.. అదే సరైన జవాబు: ‘వారు మన సైనికులను చంపుతూ ఉంటే.. మృతదేహాలను లెక్కిస్తూ ఉండిపోదామా? వారు ఒక భారత సైనికుడిని చంపితే.. మనం పదిమది పాక్ సైనికులను చంపాలి. ఇదే వారికి సరైన సమాధానం’ అని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ తేల్చి చెప్పారు.

 

అగ్రరాజ్యానికి.. మోడీని రానివ్వొద్దు!



 వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని సెప్టెంబర్ 30న అమెరికాకు రావాల్సిందిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించిన నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా సిక్కు హక్కుల సంఘం(ఎస్‌ఎఫ్‌జే-సిక్ ఫర్ జస్టిస్) అగ్రరాజ్యంలో ఆన్‌లైన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. గుజరాత్‌లో 2002 నాటి మత విధ్వంసాలను మోడీ రెచ్చగొట్టారని, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసిందని సంఘం ఆరోపించింది. ఈ నేపథ్యంలో మోడీని అగ్రరాజ్యానికి ఆహ్వానించడం తగదని డిమాండ్ చేసింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top