అశ్లీలంపైనే నా పోరాటం... అదో మత్తుమందు

అశ్లీలంపైనే నా పోరాటం... అదో మత్తుమందు - Sakshi


నీలిచిత్రాల సైట్స్ నిషేధం వెనుక ఉన్న సూత్రధారి, న్యాయవాది కమలేష్ వాస్వాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన పోరాటానికి ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు. ఢిల్లీలో  ఫిజియోథెరపీ విద్యార్థినిపై (నిర్భయ ఉదంతం) జరిగిన అమానుష అత్యాచార ఘటన తనను చాలా కదిలించిందని తెలిపారు. రోజురోజుకు మహిళలపై, బాలలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల కథనాలు టీవీలో చూసి తన మనసు కలత చెందేదన్నారు. ఈ క్రూరమైన హింసను అడ్డుకోవడానికి ఏదైనా చేయాలని చాలా తీవ్రంగా ఆలోచించేవాడినన్నారు.  



మరోవైపు ఆడవాళ్లు కూడా ఎక్కువగా అశ్లీల సైట్లను చూస్తారనే వార్తను ఆయన ఖండించారు. తన పోరాటం అశ్లీలంపై మాత్రమే కానీ, వ్యక్తులపై కాదని స్పష్టం చేశారు. తానేమీ తప్పు చేయలేదని, చట్టానికి లోబడే తన పోరాటం సాగిందని తెలిపారు. అదొక మత్తుమందు లాంటిదనీ, దానిని నిషేధించాల్సిందేనని వాదిస్తున్నారు.



మహిళలపై అత్యాచారాలకు కారణమవుతున్న అశ్లీల వెబ్‌సైట్లను అందుబాటులో లేకుండా నిలిపివేయాలంటూ ఇండోర్‌కు చెందిన న్యాయవాది కమలేష్ వాస్వాని  2013లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుమారు 15 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో  కొనసాగుతున్న ఆయన.. నీలిచిత్రాలు చూడడాన్ని నిషేధించాలని కోరారు. దీన్ని బెయిలుకు వీలులేని నేరంగా పరిగణించాలని కోరుతూ కమలేష్‌ వాస్వాని ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.  



అటు సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. దీనిపై సామాన్య జనం, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తోంటే బాలీవుడ్ ప్రముఖులు తప్పుబడుతున్నారు.  దుర్మార్గులను, కామాంధులను నిషేధించాలని సినీ జనం  వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాజ్యం (పిల్‌)పై కొందరు కన్నెర్ర చేశారు. కాలమిస్టులు, సోషల్‌ మీడియా వ్యాఖ్యాతలు దీనిపై ప్రతికూలంగా స్పందించారు. సామాజిక స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛకు ఇది భంగకరమని వ్యాఖ్యానించారు.



పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో విస్తృతంగా ఉన్న అశ్లీల వెబ్‌సైట్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది. దీనికి బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాదాపు 857  పోర్న్ వెబ్సైట్లను నిషేధించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top