కదం తొక్కిన భారత నారి


  • వేడుకల్లో మహిళా పాటవం

  • పతాకావిష్కరణ నుంచి.. కవాతు వరకూ..

  • నారీశక్తి కేంద్ర బిందువుగా సాగిన పరేడ్

  • న్యూఢిల్లీ: భారత 66వ గణతంత్రం సోమవారం ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే విధం గా మహిళా పాటవాన్ని ప్రదర్శించింది. నారీశక్తి కేంద్ర ఇతివృత్తంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ భారత్‌లో మహిళా సాధికారత ప్రపంచ పెద్దన్నను విస్మయ పరిచే విధంగా సాగింది. రాజ్‌పథ్‌లో పతాకావిష్కరణ దగ్గర నుంచి ఆసాంతం మహిళా ప్రాధాన్యమే కనిపించింది.



    మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో త్రివిధ దళాల నుంచి మహిళా జవానులు  రాజ్‌పథ్ పరేడ్‌లో వివిధ బృందాలకు, శకటాలకు నేతృత్వం వహించారు. వీరి ప్రదర్శన పరేడ్‌కు హాజరైన అశేష ప్రజానీకంలో భావోద్వేగం పెల్లుబికేలా చేసింది. ముఖ్య అతిథి ఒబామా సైతం అబ్బుర పడేలా నారీశక్తి కదం తొక్కింది. పరేడ్ సాగుతుండగానే ఆయన నేతృత్వంలో సాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తన ట్వీటర్ పేజిలో భారత మహిళా సైన్యానికి జోహారు అర్పించింది.



    ‘భారత రిపబ్లిక్ పరేడ్‌లో మహిళా సైనికపాటవం ఆకట్టుకునేలా సాగింది. భారత దేశంలోని అద్భుతమైన వైవిధ్యం ఒకేచోట ఏకరూపంగా ప్రదర్శితమైంద’ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతాకావిష్కరణ పోడియం దగ్గరకు రాగానే, కెప్టెన్ హావోబమ్ బెల్లా దేవి.. ఆయన సమక్షంలో పతాకావిష్కరణ చేశారు. మణిపూర్‌కు చెందిన రెండోతరం సైనికాధికారి బెల్లాదేవి. పతాకావిష్కరణ జరగగానే జాతీయపతాకానికి వందన సమర్పణకు ఆమే కమాండ్ చేశారు.  

     

    పరేడ్ ప్రారంభమైన తరువాత ముందుగా పదాతి దళం, కెప్టెన్ దివ్యా అజిత్ నాయకత్వంలో  సైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం చేస్తూ ముందుకు సాగింది. దివ్యా అజిత్, 2010లో చెన్నైలోని అధికారుల శిక్షణ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’  అవార్డును పొందారు. దివ్యతోపాటు నౌకా, వాయు సైన్యానికి చెందిన మహిళా జవానులు కూడా రైసీనా హిల్స్ నుంచి ఇండియా గేట్ వరకూ దేశం గర్వపడేలా కవాతును నిర్వహించారు.

    నౌకాదళం ప్రదర్శించిన శకటం ‘భారతీయ నవసేన, నారీ శక్తి’కి లెఫ్టినెంట్ కమాండర్ శ్వేతాకపూర్, లెఫ్టినెంట్ వర్తికా జోషి నాయకత్వం వహించారు. మరో నలుగురు నౌకాదళ మహిళా అధికారులుశకటంపై అపూర్వమైన పాటవాన్ని ప్రదర్శించారు. ఈ అధికారులు గోవా నుంచి రియో జానెరియో వరకు ప్రతికూల వాతావరణంలో సముద్రంపై సాహస ప్రయాణం చేసిన ధీరవనితలు. ఎవరెస్టు పర్వత శకటంపై మహిళాధికారుల పర్వతారోహణ ఆహూతులను బాగా ఆకట్టుకుంది.

     

    ‘అమ్మాయిని రక్షించు.. అమ్మాయిని చదివించు’ (బేటీ బచావో, బేటీ పఢావో పథకానికి సంబంధించిన శకటం పరేడ్‌లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఎన్‌సీసీ బ్యాండ్ బృందం కూడా బాలికల నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ బాలికలు వినిపించిన ‘సారే జహాసే అచ్చా’ గానానికి ఒబామా సతీమణి మిషెల్లీ చప్పట్లు కొట్టి  అభినందించారు. .ఎన్‌ఎస్‌ఎస్ బృందం లో 148 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన ‘మా గంగా’ శకటం మహిళా దైవశక్తిసామర్థ్యాలను చాటింది.



    పంచాయతీరాజ్ శాఖ శకటం ఈ-గవర్నెన్స్‌ను ఒక పల్లె పడుచు లాప్‌టాప్ ద్వారా వినియోగించుకుంటున్నట్లు ప్రదర్శించింది. న్యాయ శాఖ శకటం, రైల్వే శకటాలకు కూడా మహిళా సాధికారతే ఇతివృత్తమయింది. స్త్రీశిశు సంక్షేమ శాఖ బాలికలతో ‘భవిష్యత్తు మాదే’ అన్న ఇతివృత్తం తో శకటాన్ని ప్రదర్శించింది. రిపబ్లిక్‌డే పరేడ్ మొత్తం భారత మహిళా స్ఫూర్తిని సాధికారికంగా ప్రపంచానికి చాటి చెప్పింది.

     

    రాజస్థానీ తలపాగాతో మెరిసిన మోదీ



    గణతంత్ర వేడుకల్లో రాజస్థానీ ‘బాందనీ’ తలపాగాతో మోదీ మెరిసిపోయారు. నలుపు సూట్‌పై ఎరుపురంగు తలపాగా ధరించిన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఇదే వేషధారణలో కనిపించారు. ఇక ఒబామా నల్లరంగు సూట్ ధరించారు. జల్లులు కురవడం, చల్లని వాతావరణం ఉండడంతో ఒబామా తన వాహనం నుంచి దిగగానే.. సూట్‌పై నిలువెత్తు కోటు వేసుకున్నారు. మిషెల్ ఒబామా పొడవాటి నల్ల సూట్‌పై ఎర్రని స్కార్ఫ్‌తో తళుక్కుమన్నారు.

     

    2015 ఛబ్బీస్ జనవరిలో ఇవి ఫస్ట్..

     

    త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో పరేడ్

         

    గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవడం

         

    ఇటీవలే కొనుగోలు చేసిన తీరప్రాంత నిఘా, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, అత్యాధునిక మిగ్-29కే విమానం ప్రదర్శించడం ఇదే తొలిసారి.

         

    వేడుకలకు హాజరయ్యే విదేశీ ముఖ్య అతిథులు సాధారణంగా రాష్ట్రపతి వాహనంలో వస్తారు. కానీ ఈసారి ఒబామా తన సొంత వాహనం‘బీస్ట్’లో రాజ్‌పథ్‌కు వచ్చారు.

         

    సీఆర్‌పీఎఫ్‌కు చెందిన నక్సల్స్ నిరోధక దళం-కోబ్రా తొలిసారి పరేడ్‌లో పాల్గొంది.

    గణతంత్రంలో విశేషాలు..

     

    సన్నని జల్లులు కురుస్తున్నా లెక్క చేయకుండా రాజ్‌పథ్ మార్గం రెండువైపులా జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓవైపు తడిసిపోతున్నా వేడుకలను ఆసక్తిగా వీక్షించారు.

         

    సతీమణి మిషెల్‌తో కలసి ఒబామా రాజ్‌పథ్‌కు రాగానే జనం హర్షధ్వానాలు చేశారు.

         

    రాష్ట్రపతి రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో జల్లులు కురవడంతో ఒబామా తానే స్వయంగా గొడుగు పట్టుకొని నిల్చున్నారు.

         

    యువతీయువకులు ‘వి లవ్ ఒబామా’ అని చూపే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒబామా.. ఒబామా..’ అని నినాదాలు చేశారు.

         

    త్రివిధ దళాల విన్యాసాల సమయంలో చిన్నారుల కేరింతలతో రాజ్‌పథ్ మార్మోగింది.

         

    ‘నారీశక్తి’కి ప్రతీకగా త్రివిధ దళాల్లోని మహిళా అధికారులు కవాతు చేసిన సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేచి నిలబడి అనందం వ్యక్తంచేశారు.

         

    ఆకాశంలో సుఖోయ్-30 ఎంకేఐ చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి.

         

    జాతీయ సాహస అవార్డులు గెల్చుకున్న బాలలకు గౌరవసూచకంగా సందర్శకులంతా లేచి నిలబడ్డారు.

         

    గణతంత్ర వేడుకల్లో ఒబామా కారు ‘బీస్ట్’  రాజ్‌పథ్‌పై రాచఠీవి ఉట్టిపడుతూ ముందుకు వస్తుంటే అంతా ఆసక్తిగా చూశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top