‘జీఎస్టీ’పై రాష్ట్రాల ఆందోళన

‘జీఎస్టీ’పై రాష్ట్రాల ఆందోళన

  • నష్ట పరిహారంపై త్వరగా స్పందించాలి

  • అరుణ్ జైట్లీతో భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్

  • న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం వల్ల రాష్ట్రాలు భరించాల్సి వచ్చే నష్టాలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన పరిహారంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కోరారు. వచ్చే సంవత్సరం బడ్జెట్లో పొందుపర్చాల్సిన కీలకాంశాలపై చర్చించేందుకు శుక్రవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో దాదాపు 4 గంటలపాటు జైట్లీ సమావేశమయ్యారు.



    ఈ సందర్భంగా.. రాష్ట్రాలకు మరిన్ని నిధులను కేటాయించాలని, కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలను వికేంద్రీకరించాలని, మౌలిక వసతుల కల్పన కోసం మార్కెట్ నుంచి రాష్ట్రాలు నిధులు సేకరించుకునే పరిమితిని పెంచాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జైట్లీకి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ బిల్లును గతవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.



    జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తూ.. రెవెన్యూ తటస్థ రేట్లు, బాండ్లు, పరిహార ప్రక్రియ మొదలైన కీలక, వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం సాధించకుండా దాన్ని ఆమోదించకూడదని తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక మంత్రుల భేటీలో డిమాండ్ చేసింది. వృద్ధి రేటును పెంచడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని ఈ సందర్భంగా జైట్లీ వారికి చెప్పారు. ‘కొన్ని అంచనాల ప్రకారం 2015-16లో వృద్ధి రేటు 6%పైగా ఉండొచ్చని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుత సంవత్సరం అది 5.5%గా ఉండే అవకాశం ఉంది. అది గత సంవత్సరం(2013-14) సాధించిన 4.7% కన్నా కాస్త ఎక్కువ.



    రాష్ట్రాల ఆందోళనలు, సూచనలను బడ్జెట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని భేటీ అనంతరం జైట్లీ విలేకరులకు తెలిపారు. వస్తుసేవల పన్ను ప్రతిపాదనకు రాష్ట్రాల నుంచి అద్భుతమైన సానుకూల స్పందన లభించిందన్నారు. అయితే, కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని రాష్ట్రాలు కోరాయన్నారు. జనధన యోజన, స్వచ్ఛ భారత్‌లపై కూడా భేటీలో చర్చించామన్నారు. విట్రిఫైడ్ టైల్స్ సహా చైనా ఉత్పత్తుల దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచి, దేశీయ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించాలని గుజరాత్, కేరళ ఎఫ్‌ఎంలు కోరారు.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top