జార్ఖండ్‌లో గిరిజనేతర సీఎం

జార్ఖండ్‌లో గిరిజనేతర సీఎం - Sakshi

  • శాసనసభాపక్ష నేతగా రఘువర్ దాస్ ఎన్నిక

  • 28న సర్కారు ఏర్పాటుకు నిర్ణయం

  • రాంచీ: జార్ఖండ్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్ రాష్ర్ట తొలి గిరిజనేతర సీఎం కానున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రఘువర్‌దాస్ పేరును పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు. మిగతావారంతా అందుకు మద్దతు ప్రకటించినట్లు పార్టీ జాతీయ పరిశీలకుడు జేపీ నద్దా పేర్కొన్నారు.



    గతంలో రాష్ర్ట ఉపముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దాస్ ఈసారి బీజేపీ, దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూ కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. బాబూలాల్ మరాండీ, అర్జున్ ముండా తర్వాత బీజేపీ తరఫున సీఎం అవుతున్న మూడో వ్యక్తి రఘువర్ దాస్. రాష్ర్ట ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని, పేదలు, అసంఘటితరంగ కార్మికుల సంక్షేమంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత దాస్ వెల్లడించారు.



    అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బృందంతో కలిసి రాష్ర్ట గవర్నర్ సయ్యద్ అహ్మద్ వద్దకు వె ళ్లి కలిశారు. ఈ నెల 28న ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని వెల్లడించారు.  తమ ప్రతిపాదనకు గవర్నర్ అంగీకరించారని ఈ భేటీ అనంతరం దాస్ తెలిపారు. జార్ఖండ్ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత గత 14 ఏళ్లలో ఏర్పడుతున్న పదో ప్రభుత్వమిది. ఛత్తీస్‌గఢ్‌లోని బోయిర్ది నుంచి  1960లో వలస వచ్చిన ‘తెలి’ కులానికి చెందిన నేత రఘువర్ దాస్.



    ఆయన తండ్రి మన్‌దాస్. గత తొమ్మిది ప్రభుత్వాలలో గిరిజనులైన బాబూలాల్ మరాండీ (ఒకసారి), అర్జున్ ముండా (మూడు సార్లు), శిబూసోరెన్ (మూడు సార్లు), మధు కోడా (ఒకసారి), హేమంత్ సోరెన్ (ఒకసారి) ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మరోవైపు గిరిజనేతర వ్యక్తి సీఎం కాబోతుండటంపై జార్ఖండ్ పీపుల్స్ పార్టీ(జేపీపీ) నిరసన వ్యక్తం చేసింది.



    రఘువర్‌దాస్ ప్రమాణ స్వీకారం రోజున రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చింది. గిరిజనుల అభివృద్ధి కోసమే ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిందని, గిరిజనులను బీజేపీ గౌరవించడం లేదని జేపీపీ విమర్శించింది. జేడీయూ నేత నితీశ్‌కుమార్ కూడా బీజేపీ తీరును తప్పుబట్టారు. గిరిజనేతర వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం ద్వారా గిరిజనులపై బీజేపీ అపనమ్మకాన్ని చాటుకుందని విమర్శించారు.

     

    విద్యార్థి నేత నుంచి ముఖ్యమంత్రి పదవికి...




    రఘువర్ దాస్ విద్యార్థి ఉద్యమ నేతగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1976-77లో ప్రారంభించిన విద్యార్థి ఉద్యమంలో ఆయన పాలుపంచుకున్నారు. జంషెడ్‌పూర్ సహకార కళాశాలలో విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన అనంతరం, సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరారు. జంషెడ్‌పూర్ (ఈస్ట్) అసెంబ్లీ స్థానంలో 1995 నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. బాబూలాల్ మరాండీ మంత్రివర్గంలో ఒకసారి, అర్జున్‌ముండా ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. 2009లో శిబూసోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆర్థిక, కార్మిక, పట్టణాభివృద్ధి శాఖలకు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా రెండుసార్లు పనిచేశారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యాక, దాస్ ఇటీవలే బీజేపీ ఉపాధ్యక్షుడయ్యారు.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top