ఎన్డీయేలో జేడీయూ చేరిక

ఎన్డీయేలో జేడీయూ చేరిక

- జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం

పార్టీ మొదట్నుంచీ నేనున్నా.. నన్నే తరిమేస్తారా?: శరద్‌ యాదవ్‌  

 

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరింది. బీజేపీ కూటమితో ఉన్న పాత బంధాన్ని మళ్లీ చిగురింపజేసింది. పట్నాలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరటంపై తీర్మానం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాకూటమికి జేడీయూ గుడ్‌ బై చెప్పింది. జాతీయకార్యవర్గ  సమావేశంలో నితీశ్‌ మాట్లాడుతూ.. తమ వర్గంపై విమర్శలు చేస్తున్నవారు దమ్ముంటే పార్టీని చీల్చి చూపించాలని పరోక్షంగా శరద్‌ యాదవ్‌కు సవాల్‌ విసిరారు. పార్టీ జాతీయ కార్యవర్గానికి గైర్హాజరైన శరద్‌ యాదవ్‌.. పార్టీ ఎంపీ అలీ అన్వర్‌తో కలిసి ‘జన్‌ అదాలత్‌’ నిర్వహించారు. ప్రజలు 2015లో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నితీశ్‌ బీజేపీతో జట్టుకట్టాడని ఆయన విమర్శించారు. కాగా, ఎన్డీయేలో చేరుతూ జేడీయూ జాతీయ కార్యవర్గం తీర్మానం చేయటాన్ని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా స్వాగతించారు.   

 

అంతా మావైపే: కేసీ త్యాగి 

‘పార్టీ చీఫ్, సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో సమావేశమైన జేడీయూ జాతీయ కార్యవర్గం.. ఎన్డీయేలో చేరాలని తీర్మానించింది. దీంతో మేం ఎన్డీయేలో భాగస్వాములమయ్యాం’ అని పార్టీ సీనియర్‌ నేత త్యాగి స్పష్టం చేశారు. ‘71 మంది పార్టీ ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు, పార్టీ పదాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాంటప్పుడు పార్టీలో చీలిక ఉందని ఎలా అంటారు?’ అని త్యాగి ప్రశ్నించారు. శరద్‌ యాదవ్‌పై ప్రస్తుతానికి విప్‌ జారీ చేయబోవటంలేదని ఆయన తెలిపారు. అయితే పట్నాలో ఆగస్టు 27న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరగనున్న విపక్షాల ర్యాలీకి శరద్‌ యాదవ్‌ హాజరైతే.. చర్యలు తప్పవన్నారు. బిహార్‌ సీఎం అధికారిక నివాసం ముందు నితీశ్, యాదవ్‌ వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. 

 

అప్పుడెందుకు మాట్లాడలేదు! 

తమదే అసలైన పార్టీ అని చెబుతున్న యాదవ్‌ వర్గం నేతలు.. దమ్ముంటే పార్టీని చీల్చాలని సవాల్‌ విసిరారు. ‘వారికి సత్తా ఉంటే జేడీయూ శాసనసభాపక్షాన్ని చీల్చి చూపించాలి. అనవసరంగా పసలేని విమర్శలు చేయటం మానుకోండి. 2013లో ఎన్డీయే నుంచి జేడీయూ విడిపోవాలనుకున్నప్పుడు శరద్‌ యాదవ్‌ ఎందుకు మాట్లడలేదు? అప్పుడు మీరే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కదా?’ అని నితీశ్‌ ప్రశ్నించారు.  ‘2004 లోక్‌సభ ఎన్నికల్లో మధేపుర నుంచి శరద్‌ యాదవ్‌ ఓడిపోతే.. అప్పటి పార్టీ చీఫ్‌ జార్జి ఫెర్నాండేజ్‌తో రెండుగంటలపాటు మాట్లాడి రాజ్యసభకు శరద్‌ యాదవ్‌ను పంపేలా ఒప్పించాను’ అని నితీశ్‌ పేర్కొన్నారు. ‘చౌదరీ దేవీలాల్‌తో కలిసి  పార్టీ నిర్మాణంలో పనిచేశాను. నన్నే తరిమేయాలనుకుంటున్నారు. నేను ఎవరికీ భయపడను’ అని శరద్‌ యాదవ్‌ అన్నారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top