జయలలిత అను నేను..

జయలలిత అను నేను..


చెన్నై, సాక్షి ప్రతినిధి:  చెన్నై రాధాకృష్ణ నగర్ (ఆర్కే నగర్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1.52 లక్షల మెజారిటీతో గెలిచిన జయలలిత ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడికాగానే ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేస్తారని అంచనావేశారు. సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆనాడు అమ్మ పదవీ ప్రమాణం చేయలేదు. నేడో రేపో అని అందరూ అంచనాలు వేస్తున్న తరుణంలో అకస్మాత్తుగా 20 రోజుల విశ్రాంతి కోసం కొడనాడుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.



దీంతో ఇప్పట్లో ఎమ్మెల్యేగా ప్రమాణం ఉండదని భావిస్తుండగా శనివారం మరోసారి షాకిచ్చారు.శనివారం ఉదయం 11 గంటలకు సచివాలయం చేరుకుని నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. సభాపతి ధనపాల్ ముఖ్యమంత్రి జయలలిత చేత పదవీ ప్రమాణం, ప్రతిజ్ఞ చేయించారు. ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా జయలలితను పరిగణిస్తున్నట్లు ధనపాల్ ప్రకటించారు.

 

అదాని గ్రూపుతో ఒప్పందం:

రామనాథపురం జిల్లా కముదిలో అదాని గ్రూపు సంస్థల సహకారంతో 648 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ముఖ్యమంత్రి జయలలిత, విద్యుత్‌మంత్రి నత్తం విశ్వనాథన్ సమక్షంలో ఇరుపక్షాలకు చెందిన ఉన్నతాధికారులు సంతకం చేశారు. అదాని గ్రూపు సంస్థలతో జయ భేటీ రెండుసార్లు వాయిదాపడడంతో ఇక ఒప్పందం లేనట్లేననే విపక్షాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ ఒప్పందం పూర్తిచేశారు. ఈ కార్యక్రమాల కారణంగా జయ కొడనాడు పయనం నిరవధికంగా వాయిదా పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top