అన్నీ తానైన శశికళ..

అన్నీ తానైన శశికళ.. - Sakshi


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారంలో ఆమె స్నేహితురాలు అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. రాజాజీ హాల్‌లో జయలలిత పార్ధివదేహం చుట్టూ సీఎం పన్నీర్ సెల్వం, శశికళ, ఆమె భర్త నటరాజన్, దత్తపుత్రుడు సుధాకర్, అన్న కూతురు దీప ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. ఇంతకాలం జయలలిత దగ్గరకు రాకుండా ఉన్న శశికళ భర్త నటరాజన్ మంగళవారం ఆమె భౌతికకాయం వద్ద హడావుడి చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన సమయంలో ఇతరులెవరూ దరిదాపుల్లోకి రాకుండా శశికళ కట్టడి చేయగలిగారు. హిందూ సంప్రదాయం ప్రకారం దత్త పుత్రుడు అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది.



అయితే జయ దత్తపుత్రుడు సుధాకర్‌కు ఆ అవకాశం కల్పిస్తే అధికారికంగా వారసుడిగా గుర్తించినట్లు అవుతుందనే భయంతో ఆయన్ను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారు. గవర్నర్, సీఎం, మాజీ గవర్నర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చివరిసారిగా పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించాక శవపేటిక మీద ఉంచిన జాతీయజెండాను తీసి శశికళకు అందించారు. ఆ తర్వాత ఆమె శవపేటిక చుట్టూ నీళ్లు, బియ్యం చల్లి, గంధపు చెక్కల ముక్కలు ఉంచి జయకు అంతిమ సంస్కారాలు చేశారు. స్నేహితురాలి పట్ల ఉన్న అపార అభిమానం చాటుకుని ఆమె రుణం తీర్చుకోవడానికే శశికళ తన చేతుల మీదుగా అంత్యక్రియలు చేశారని శశికళ మద్దతుదారులు చెబుతున్నారు. ఇకపై పార్టీలో, ప్రభుత్వంలో తాను ఏది చెబితే అదే జరుగుతుందని పరోక్షంగా చూపించుకోవడానికి జయ బంధువులెవరినీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారని శశికళ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు కూడా కనిపించింది. తన స్నేహితురాలి చివరి యాత్ర తన ఇష్ట్రపకారమే జరగాలని పట్టుబట్టిన ఆమె స్నేహితురాలు శశికళ తన పంతం నెగ్గించుకున్నారు.



 నేస్తం మాటే నెగ్గింది...

 అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినప్పటి నుంచి ఆమె అంత్యక్రియల నిర్వహణపై పన్నీర్ సెల్వం, శశికళ తమ మాట చెల్లుబాటు అయ్యేలా ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పేరు పొందిన అమ్మ పార్థివ దేహాన్ని మంగళ, బుధవారాలు ప్రజల సందర్శనార్థం ఉంచి గురువారం అంత్యక్రియలు చేరుుంచాలని పన్నీర్ సెల్వం భావించారు. మంగళవారం వీఐపీలు ఆమె భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వెళితే, బుధ, గురువారాలు సాధారణ ప్రజలకు చివరి చూపు అవకాశం కల్పించాలని ఆయన భావించారు. మూడు రోజుల పాటు మృత దేహాన్ని ఉంచుకోవడానికి అవసరమైన వైద్య సహాయం ఏర్పాటు చేరుుంచాలని కూడా యోచించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చర్చలు జరిపిన సందర్భంలో సెల్వం తన అభిప్రాయాలను తెలియచేశారు. ఇదే చర్చల్లో పాల్గొన్న శశికళ మంగళవారమే అంత్యక్రియలు పూర్తి చేద్దామని స్పష్టంచేశారు. ఆలస్యం అయ్యే కొద్దీ పార్టీ శ్రేణులు, ప్రజలను అదుపు చేయడం ఇబ్బంది అవుతుందని ఆమె గట్టిగా చెప్పారు. చివరకు ఆమె మాటే నెగ్గి మంగళవారం సాయంత్రమే అంత్యక్రియలు చేయాలని నిర్ణరుుంచారు.



 అతనెవరు?: మెరీనా బీచ్ ఒడ్డున జయలలిత అంతిమ సంస్కారం చేస్తున్న సమయంలో మొదటి నుంచి చివరి దాకా శశికళ వెన్నంటే ఉన్న యువకుడు ఎవరు? అతనికి అంత ప్రాధాన్యత ఎలా దక్కింది? అని అన్నా డీఎంకే పార్టీ ముఖ్యులతో పాటు, తమిళ మీడియా సంస్థలు ఆరా తీశారుు. అతను జయలలిత సోదరుడు జయకుమార్ కొడుకు దీపక్‌గా గుర్తించారు. ఇప్పటివరకు ఎవరో కూడా తెలియని దీపక్‌కు శశికళ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.



 ఉదయం నుంచి వెంకయ్య అక్కడే

 రాజాజీ హాల్‌కు ఉదయం 8గంటలకు జయలలిత భౌతికకాయం వచ్చినప్పటినుంచి మెరీనా బీచ్ ఒడ్డున అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అక్కడే గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే వెంకయ్య తొలి నుంచి చివరివరకు అంతిమ సంస్కారాలను దగ్గరుండి నడిపించారని బీజేపీ వర్గాలు చెబుతున్నారుు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top