సీఎం పీఠంపై జయ

సీఎం పీఠంపై జయ


ఐదోసారి తమిళ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అన్నాడీఎంకే అధినేత


చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల మధ్య గవర్నర్ కె.రోశయ్య శనివారం జయతో సీఎంగా ప్రమాణం చేయించారు. తమిళనాడు సీఎంగా ఆమె పగ్గాలు చేపట్టడం ఇది ఐదోసారి. చెన్నైలోని మద్రాస్ వర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. జయతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.  ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం కాగా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో పది గంటలకే ఆడిటోరియం నిండిపోయింది.



10.56 గంటలకు జయ, 11 గంటలకు గవర్నర్ వేదికపైకి చేరుకున్నారు. పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్‌కు స్వాగతం పలికిన జయ.. తన మంత్రివర్గ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. తర్వాత గవర్నర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ముహూర్త సమయం ముంచుకురావడంతో కార్యక్రమం మొదట్లో జాతీయ గీతాన్ని కుదించారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత పూర్తి గీతాన్ని ఆలపించారు.







28 మంది మంత్రులు 14 మంది చొప్పున రెండు విడతలుగా ప్రమాణ ం చేశారు. 20 నిమిషాల్లో కార్యక్రమం ముగిసింది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నటులు శరత్‌కుమార్, శివకుమార్, సంగీత దర్శకులు ఇళయరాజా, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై, ఇండియా సిమెంట్స్ అధిపతి ఎన్.శ్రీనివాసన్, పలువురు మత పెద్దలు హాజరయ్యారు. జయ నెచ్చెలి శశికళ తన కుటుంబ సభ్యులతో కలసి ముందు వరుసలో కూర్చున్నారు. ప్రధాని మోదీ.. జయకు ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ప్రమాణం తర్వాత జయలలిత అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లారు.



ఆకుపచ్చ సెంటిమెంట్: చేతికి ఆభరణాలను ధరించే అలవాటు లేని జయ తొలిసారి ఆకుపచ్చరాయి ఉంగరం ధరించడం విశేషంగా మారింది. శుక్రవారం గవర్నర్‌తో భేటీ సమయంలో, జయ ఆకుపచ్చ రంగు చీరలో కనిపించారు. శనివారం ప్రమాణానికీ అకుపచ్చ చీరలోనే వచ్చి, అదే రంగు పెన్నుతో తొలి సంతకం చేశారు. వేదికపై గవర్నర్‌కు స్వాగతం చెబుతూ జయ ఇచ్చిన పుష్పగుచ్ఛం సైతం ఆకుపచ్చ రంగులోనే ఉండడం విశేషం. 8 నెలల తర్వాత తమ అభిమాన నేత జయ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టడంతో చెన్నైలోని అన్నాడీఎంకే శ్రేణులు, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

 

కరుణ రికార్డు సమం

తమిళనాడు సీఎంగా ఐదుసార్లు ప్రమాణం చేసిన డీఎంకే కరుణానిధి రికార్డును శనివారం జయ సమం చేశారు. 1991లో జయ తొలిసారిగా సీఎం అయ్యారు. 2001 మే 14న రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కొద్దికాలానికే టాన్సీ కేసుల్లో చిక్కి పదవి నుంచి వైదొలిగారు. ఈ కేసుల నుంచి బయటపడ్డాక 2002 మార్చి 2న మూడోసారి సీఎం అయ్యారు. 2011 మే 16న నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టిన జయ.. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో పదవి కోల్పోయారు. ఈనెల 11న కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో శనివారం ఐదోసారి సీఎం  పీఠం ఎక్కారు. జయకు కష్టకాలంలో రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన రికార్డు పన్నీర్ సెల్వం సొంతమైంది. సీఎంగా పన్నీర్‌సెల్వం చేసిన రెండు ప్రమాణాలు సెప్టెంబర్ నెలలోనే జరగడం విశేషం.

 

రాజకీయ ఫీనిక్స్!

పురచ్చితలైవి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు! ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి పునరుజ్జీవం పొందిన ‘ఫీనిక్స్’ పక్షిలా  పెకైగరడం ఆమె నైజం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేయడంలో అయినా, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో అయినా జయలలితది ప్రత్యేక శైలి.



ఆమె జీవిత విశేషాలివీ..

అసలు పేరు: కోమలవల్లి

జననం: 1948, ఫిబ్రవరి 24. మైసూరు రాష్ట్రం  (ప్రస్తుతం కర్ణాటక)లోని మాండ్య జిల్లా మెలుకొటే

విద్యాభ్యాసం: బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూలు

సినీ జీవితం: 140కిపైగా తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటన

మొదటి సినిమా: చిన్నడ గొంబే(కన్నడ), 1964

పేరు తెచ్చిన సినిమా: మనుషులు మమతలు, 1965



రాజకీయాల్లోకి..

1981: రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఎంజీఆర్

1983: అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా

1984-1989: రాజ్యసభ సభ్యురాలు

1987: ఎంజీఆర్ మృతి, చీలిన పార్టీ.  ఎంజీఆర్ భార్య జానకి వర్గం జయ వర్గంలో విలీనం

1989: తొలి మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు

1991-96: తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు

గెలుపోటములు:

1989, 1991, 1996, 2002, 2006, 2011 సంవత్సరాల్లో అసెంబ్లీకి పోటీ. 1996లో తప్ప మిగతా అన్నిసార్లు జయకేతనం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top