జైలులో సాదాసీదాగా జయ

జైలులో సాదాసీదాగా జయ - Sakshi


బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత ఆదివారం సాదాసీదాగా గడిపారు.జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్‌లో ఉంచారు. ఇందులో ఓ ఫ్యాన్, మంచాలు, టేబుల్, టీవీ, కుర్చీలు ఉంటాయి. వీఐపీ హోదా ఉండడంతో సాధారణ ఖైదీల దుస్తులను ఆమెకివ్వలేదు. జైలుకు చేరిన తొలి రోజు రాత్రి (శనివారం) ఆమె సరిగా నిద్రపోలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించిన జయ ఆదివారం పొద్దున 5.30కు లేచారు. 45 నిమిషాలు మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం దినపత్రికలు  చదివారు. జైలులో వండిన ఆహారం తినేందుకు నిరాకరించిన జయ బయటి నుంచి ఇడ్లీ, సాంబార్ తెప్పించుకుని అల్పాహారం చేశారు.



మధుమేహంతో బాధపడుతున్న జయకు ఆదివారం రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోవైపు జయను కలవడానికి ఆదివారం ఉదయం తమిళనాడు నుంచి వచ్చిన మంత్రులు, అధికారులను జైలు సిబ్బంది అనుమతించలేదు.జైలు నిబంధనల ప్రకారం ఆదివారం బయటి వ్యక్తులను ఖైదీలతో కలవడానికి అనుమతించడం లేదు. జయకు  బెయిల్ కోసం ఆమె లాయర్లు సోమవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top