జయ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

జయ బెయిల్  పిటిషన్‌పై నేడు విచారణ - Sakshi


విచారణను తొలుత అక్టోబర్ 6కు  వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు

సత్వర విచారణపై జయ తరఫు లాయర్ల వినతికి ఆ తర్వాత

ధర్మాసనం అంగీకారం


 

బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణ జరుపుతుంది. కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్నారు. జయలలిత బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదావేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. విచారణను సత్వరమే చేపట్టాలని, దీని కోసం తాను లండన్ నుంచి వచ్చానని, తనకు 5నిముషాలు అవకాశం ఇస్తే జయలలితపై ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని అంత కు ముందు రాం జెఠ్మలానీ విన్నవించారు. హైకోర్టుకు దసరా సెలవుల కారణంగా జయలలిత పిటిషన్ మంగళవారం ఉదయం వెకేషన్ బెంచ్ పరిశీలనకు వచ్చింది. ఆస్తుల కేసులో తనపై అభియోగాలు సరికాదని, చట్టబద్ధంగానే తాను ఆస్తులు సంపాదించానని జయలలిత తన అప్పీల్‌లో వాదించారు. అయితే, అప్పీలుపై హైకోర్టు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌ఎస్‌పీ)గా తన నియామకానికి సంబంధించిన, నోటిఫికేషన్ ఏదీ తనకు అందనందున ఎస్‌ఎస్‌పీ హోదాలో వాదనకు తనకు అధికారం లేదని, అందువల్ల తనకు మరికొంత వ్యవధి కావాలని, ఇదే కేసుపై ప్రత్యేక కోర్టులో ఎస్‌ఎస్‌పీగా వ్యవహరించిన జీ భవానీ సింగ్ కోరారు.



దీంతో విచారణను తొలుత అక్టోబర్ 6కు కోర్టు వాయిదా వేసింది. జయలలిత స్నేహితురాలు శశికళ, సమీప బంధువు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకర న్‌ల బెయిల్ పిటిషన్లపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేశారు. కానీ, జయలలిత తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు బుధవారం విచారణకు ధర్మాసనం సమ్మతించిం ది. దాదాపు18ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, జయలలిత సహా నలుగురిని దోషులుగా ప్రత్యేక కోర్టు గత శనివారం నిర్ధారించింది. జయలలితకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ. 100కోట్ల భారీ జరిమానా, మిగతా ముగ్గురికి నాలుగేళ్ల జైలు సహా పదికోట్ల చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైకేల్ డీకున్హా తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.



కోలీవుడ్ ‘మౌన నిరసన’



అన్నా డీఎంకే అధినేత్రి, ఒకప్పటి సినీనటి జయలలితకు సంఘీభావంగా తమిళనాడు సినీ పరిశ్రమ చెన్నైలో మంగళవారం మౌన నిరసన దీక్ష నిర్వహించింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కళాకారులు,  కార్మికులు దీక్ష నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, నటులు ప్రభు, భాగ్యరాజ్, వెన్నిరాడై నిర్మల తదితరులు దీక్షలో పాలు పంచుకున్నారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉన్నట్టుగా భావిస్తున్న ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్‌లు నిరసనల్లో పాల్గొనలేదు. సినిమా, టెలివిజన్ సీరియళ్ల షూటింగులు, సినిమా ప్రదర్శనలు రద్దు చేశారు. మరోవైపు, జయలలితకు జైలుశిక్ష పట్ల ఆవేదనతో తాజాగా ఐదుగురు మరణించారు. దీనితో మృతుల సంఖ్య 18కి పెరిగింది. అన్నా డీఎంకే కార్యకర్తలు పలుచోట్ల నిరసనలుకొనసాగించారు.



‘అమ్మ’ ఫొటోల తొగింపు



ఇక, చెన్నైలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటుగా వెబ్‌సైట్లలో కూడా జయలలిత ఫొటోలను తొలగించారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top