జయ ప్రమాణం నేడే

జయ ప్రమాణం నేడే


ఐదోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు  మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం

 

శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన పురుచ్చితలైవి

సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా.. గవర్నర్ ఆమోదం

అభిమానుల జయజయధ్వానాల మధ్య రాజ్‌భవన్‌కు పయనం

గవర్నర్ రోశయ్యతో భేటీ.. 28 మందితో కూడిన మంత్రుల జాబితా అందజేత


 

చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. శుక్రవారం తమిళనాట కీలక పరిణామాలు చకచక చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటలకే పార్టీ ప్రధాన కార్యాలయంలో 148 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జయను శాసనసభా పక్ష నేత(ఎల్పీ)గా ఎన్నుకున్నారు.



అదే సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతు పలకడం గమనార్హం.







ఈ భేటీ తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జయలలిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కె.రోశయ్యకు కొత్త మంత్రుల జాబితాను అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ నుంచి నేరుగా మౌంట్‌రోడ్డుకు వెళ్లి ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పన్నీర్ సెల్వం రాజీనామాతోపాటు కొత్త మంత్రుల జాబితాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడి ఎనిమిది నెలల తర్వాత జనంలోకి వచ్చిన జయకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది.



నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది జయకు జేజేలు పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అన్నాడీఎంకే ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలే కనిపించాయి. జయ నివాసం వద్ద కూడా సంబరాలు మిన్నంటాయి. భారీ సంఖ్యలో చేరుకున్న మహిళా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వారందరికి అభివాదం చేస్తూ జయ తన కారులో ముందుకు సాగారు.



మంత్రివర్గంలో పాత ముఖాలే!

జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. 2011-14 మధ్య తాను సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 11న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.



నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: కర్ణాటక సీఎం

బెంగళూరు: జయ కేసులో అప్పీలుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ‘ఈ అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తోంది. తీర్పును వారు అధ్యయనం చేస్తున్నారు. న్యాయశాఖ, ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం’అ ని విలేకరులకు చెప్పారు. కాగా, అప్పీలుకు వెళ్లాల్సిందిగా తాను ఇప్పటికే సలహా ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top