మహిళలతో దారుణంగా ప్రవర్తిస్తారు!

మహిళలతో దారుణంగా ప్రవర్తిస్తారు!


ఐసిస్ గురించి భారతీయ ఉగ్రవాది వెల్లడించిన వివరాలు ఇవీ..



న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో ఆత్మాహుతి దాడికి శిక్షణ పొందిన మహారాష్ట్రకు చెందిన ఆరిబ్ ఫయ్యాజ్ మజీద్(23).. ఇరాక్‌లోని కుర్దిష్ ఆర్మీ కేంద్రాలపై మూడుసార్లు ఆత్మాహుతి దాడికి విఫలయత్నం చేసి గాయాల పాలై, భారత్‌కు తిరిగి వచ్చాడు. ఇక్కడ ఆరిబ్‌ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు ఆయనను విచారించాయి. వారి విచారణలో తేలిన విషయాలను ఆంగ్ల వార్తా చానెల్ ఎన్డీటీవీ సంపాదించింది.  

 

అధికారులకు ఆరిబ్ ఏం చెప్పాడంటే..

‘మాది మహారాష్ట్రలోని పాన్వెల్. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తరువాత మే 2014లో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఐసిస్‌లో చేరేందుకు ఇరాక్ వెళ్లాను. ఆత్మాహుతి దాడిలో శిక్షణ పొందాను. తరువాత ఇరాక్‌లోని మోసుల్‌లో కుర్దిష్ సైన్యంపై దాడికి 3 సార్లు విఫలయత్నం చేశాను. మొదటిసారి ఆగస్ట్ 2014లో దాడికి సిద్ధమవుతుండగానే, అంతకుముందు రోజు రాత్రి మేమున్న స్థావరంపై వైమానిక దాడి జరిగింది. మా ఆయుధాలు ఉన్న వాహనం ధ్వంసమైంది. రెండోసారి, సెప్టెంబర్ 2014లో రాబియాలో దాడికి వెళ్తుండగా మా వాహనాన్ని ప్రత్యర్థి సైన్యం ధ్వంసం చేసింది. నాటి కాల్పుల్లో గాయాలతో తప్పించుకున్నా. మూడోసారి మందుగుండు సామగ్రితో ఉన్న మా కారుపై మళ్లీ దాడి జరిగింది.

 

ఆ తరువాత గత నవంబర్‌లో భారత్‌కు వచ్చి, పోలీసులకు చిక్కాను. ఆ లోపు సిరియాలో నా సివిల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో భూగర్భ బంకర్లను నిర్మించాను. యువతను ఆకర్షించేందుకు ఐసిస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. అందమైన సిరియా యువతులను పెళ్లి చేసుకోవచ్చని కూడా ఆశ చూపుతుంది. కానీ, తమకు బందీలుగా చిక్కిన యువతుల పట్ల ఐసిస్ దారుణంగా ప్రవర్తిస్తుంది. వారిని పశువుల కన్నా హీనంగా, సెక్స్ స్లేవ్స్‌గా చూస్తుంది’. అని తెలిపాడు.



‘మహిళల పట్ల ఐసిస్ దురాగతాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మేం వాటిని మా నివేదికలో పొందుపర్చలేనంత అసహ్యంగా ఉన్నాయి’ అని  దర్యాప్తు అధికారి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top