మీకు ఇదే వార్తా? ఇంకేమీ సమస్యలే లేవా?

మీకు ఇదే వార్తా? ఇంకేమీ సమస్యలే లేవా? - Sakshi


ఆరేళ్ల బాలిక రేప్‌పై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక పబ్లిక్ స్కూల్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన పై బెంగళూరులోనే కాక దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికిన నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  మంగళవారం చేసిన తాజా వ్యాఖ్యలు మరో వివాదం రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో దోషులను శిక్షించాలంటూ ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వీధుల్లో ఆందోళన జరుపుతుండగా,  కేసు విచారణలో పురోగతిపై సమాచారం అడిగిన విలేకరిపై సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.  ’అసలు ఈ వార్త తప్ప మరే వార్తలూ, సమస్యలూ లేవా? మీకు ఈ వార్త మాత్రమే కావాలా? ఈ కేసులో ఎలాంటి చర్య అవసరమో అవే చర్యలు తీసుకుంటాం. ఎక్కడ గూండా చట్టం ప్రయోగించాలో అక్కడ ప్రయోగిస్తాం.’ అంటూ విలేకరిపై విసుక్కున్నారు. అంతేకాదు.. ప్రతిపక్షం బీజేపీపై కూడా ఆరోపణలు సంధించారు.



ఈ కేసులో రాజకీయ లబ్ధికోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజకీయం చేస్తోందని అన్నారు. ఈ కేసుపై పోలీసులు వేగంగా స్పందించడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో సీఎం సిద్ధరామయ్య  ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా, మహిళలపై లైంగిక నేరాలు అన్న అంశంపై గత శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో సిద్ధరామయ్య తన సీట్లో కళ్లుమూసుకుని నిద్రలో జోగుతున్నట్టు ఉన్న దృశ్యాలు, టీవీ చానళ్ల లో కనిపించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. సభలో కునుకుతీయలేదని, చర్చను శ్రద్ధగా వింటున్నానని ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.  మరో వైపు, విబ్జియార్ స్కూలు ఘటనతోపాటు, 22ఏళ్ల యువతిపై కారులో జరిగిన అత్యాచారం, ఓ శిక్షణా సంస్థలో పదహారేళ్ల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన మానభంగం, తాజాగా మూడేళ్ల బాలికపైనా జరిగిన రేప్ ఘటనలు సిద్దధరామయ్య సర్కారును ఇరుకున పడేశాయి.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top