‘కేలండర్’కి మారడం కష్టమా?

‘కేలండర్’కి మారడం కష్టమా? - Sakshi


- జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరంపై కేంద్రం కసరత్తు

- భారత్లో 150 ఏళ్లుగా ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం

- అభివృద్ధి చెందిన దేశాల్లో కేలండర్ఏడాదే ఆర్థిక ఏడాది

- కేలండర్కు మారడం అంతర్జాతీయ వ్యవస్థకు అనుగుణం

- దేశంలో రుతుపవనాల చక్రానికీ అనుగుణంగా ఉంటుంది

- ఇప్పటికిప్పుడు అమలు చేస్తే చాలా వ్యయప్రయాసలు

- జీఎస్టీ అమలు విషయంలో ఇప్పటికే కొంత గందరగోళం

- దానికితోడు ఆర్థిక సంవత్సరాన్నీ మారిస్తే ఇంకా ఇబ్బందే

- రెండుమూడేళ్లు ఆగటం ఉత్తమం: ఆర్థిక నిపుణుల సూచన




(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)



కొత్త సంవత్సరం అంటే.. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలు.. కొత్త ప్రణాళికలు! జనవరి 1తో మొదలయ్యే కొత్త సంవత్సరం ప్రపంచంతో పాటు భారత ప్రజలకూ క్రొంగొత్త కాలమే! కేలండర్మారడంతోనే కొత్త సంవత్సరంతో పాటు కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు భావిస్తాం. కానీ.. మన దేశ ఆర్థిక వ్యవస్థకు.. దానికి ముడిపడివున్న దేశ ప్రజల ఆర్థిక వ్యవహారాలకు మాత్రం కొత్త సంవత్సరం ఏప్రిల్1తో మొదలవుతుంది. ఇది 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర వ్యవస్థ. చాలా దేశాల్లో.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్త కేలండర్తోపాటే కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ఆరంభమవుతుంది. ఆయా దేశాల్లో జనవరి  డిసెంబర్ఆర్థిక సంవత్సర వ్యవస్థ ఉండటమే దీనికి కారణం. దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జనవరి  డిసెంబర్కు మార్చే అంశంపై కేంద్రంలోని మోదీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. గత ఆదివారం నీతి ఆయోగ్పాలక మండలి సమావేశంలో మోదీ అ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్పు వల్ల లాభనష్టాలేమిటి? దీనిపై ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?



150 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానం..:

బ్రిటిష్పాలకులు 1867లో బ్రిటన్సామ్రాజ్యంలో అనుసరించే విధానానికి అనుగుణంగా భారత ఆర్థిక వ్యవహారాల జమాలెక్కల కోసం ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ఇదే వ్యవస్థను కొనసాగించారు. 1992లో దేశంలో ఆర్థిక సంస్కరణల శకం మొదలైనపుడు.. ఆర్థిక సంవత్సర వ్యవస్థను కూడా జనవరి  డిసెంబర్కు మార్చాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవి ముందుకు సాగలేదు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర్ఆచార్య సారథ్యంలోని నిపుణుల కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆర్థిక మంత్రిత్వశాఖకు అందించిన నివేదికలో.. ఆర్థిక సంవత్సరాన్ని జనవరి  డిసెంబర్కు మార్చాలని ప్రతిపాదించింది. దేశంలో కీలకమైన రుతుపవనాల చక్రానికి, రబీ, ఖరీఫ్పంటల కోత సమయాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని క్రమబద్ధం చేయడం ఈ కమిటీ చెప్పిన ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యవసాయ ఆదాయం అతి ముఖ్యమైన మన దేశంలో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్లను తయారు చేయాలని ప్రధాని మోదీ, నీతి ఆయోగ్చైర్మన్అరవింద్పణగరియాలు కూడా బలంగా భావిస్తున్నారు. దాదాపు 150 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ ఆర్థిక సంవత్సరం విధానాన్ని మార్చడమంటే భారీ మార్పే అవుతుంది. అదే జరిగితే.. దేశ బడ్జెట్తేదీని ప్రస్తుతమున్న ఫిబ్రవరి నుంచి నవంబర్నెలకు మార్చడం, పన్ను మదింపు సంవత్సరాన్ని మార్చడం, దానికి అనుగుణంగా సంబంధిత మౌలిక సదుపాయాలను పునర్వ్యవస్థీకరించడం, పార్లమెంటు సమావేశాల సమయాలను మార్చడం వంటి చాలా మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది.



‘కేలండర్’కి మారితే వల్ల లాభాలివీ..:

 ఆర్థిక సంవత్సరాన్ని కేలండర్సంవత్సరానికి మార్చడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనవరి  డిసెంబర్ఆర్థిక సంవత్సరాన్నే పాటిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత ఎక్కువగా సమ్మిళతమవుతుండటం, దేశంతో చాలా అంతర్జాతీయ సంస్థల వాణిజ్య లావాదేవీలు పెరుగుతుండటం వంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక సంవత్సరాన్ని అభివృద్ధి చెందిన దేశాల విధానంలోకి మార్చడం.. అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేస్తుంది.

 ముఖ్యంగా స్వదేశంలో ఒక తరహా ఆర్థిక సంవత్సరాన్ని, భారత్లో మరొక తరహా ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించాల్సి వస్తున్న బహుళజాతి సంస్థలకు పద్దుల నిర్వహణలో ఉపశమనం లభిస్తుంది. ‘‘అంతర్జాతీయ విధానానికి మారడం మంచిది. మన దేశాన్ని మిగతా ప్రపంచం వరుసలో నిలుపుతుంది. వలస పాలకులు ప్రవేశ పెట్టిన విధానాన్ని అనుసరించడాన్ని కొనసాగించాల్సిన అవసరమేమీ లేదు’’ అని రేటింగ్ఏజెన్సీ అయిన క్రిసిల్లో ముఖ్య ఆర్థికవేత్త డి.కె.జోషి పేర్కొన్నారు.



అలాగే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో బడ్జెట్ప్రవేశపెట్టే సమయానికి.. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుతుపవనాల రాకపై నిర్దిష్ట సమాచారం ఉండదు. ఇది ఆదాయ  వ్యయాల అంచనాల పట్టికలో అనిశ్చితికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థిక సంవత్సరాన్ని జనవరి  డిసెంబర్మార్చితే ఈ అనిశ్చితికి తావుండదనేది పలువురు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.



ఇప్పటికిప్పుడు మారడం సమస్యాత్మకం..:

ఆర్థిక సంవత్సరాన్ని ఉన్నపళంగా మార్చేస్తే కొన్ని సమస్యలూ ఉంటాయని మరికొందరు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ప్రవేశపెట్టే సమయాన్ని ఈ ఏడాది ఒక నెల ముందుకు జరిపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మార్పుకు సిద్ధం కావాల్సింది ప్రధానంగా ప్రభుత్వ సంస్థలే కానీ పరిశ్రమలు, కంపెనీలకు సంబంధించినది కాదు. కాబట్టి ఆ మార్పు సులభమైనదే. అదే ఆర్థిక సంవత్సరాన్ని మార్చడమంటే ప్రభుత్వ విభాగాలతో పాటు దేశంలోని అన్ని రంగాలూ అందుకు అనుగుణంగా తమ చిట్టాపద్దులను సవరించాల్సి ఉంటుంది.



ముఖ్యంగా దేశంలోని కంపెనీలు, ప్రభుత్వ పన్ను విభాగాలు ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సర చట్రంలో నడుస్తున్నాయి. తక్షణమే ఈ సంవత్సరాన్ని మార్పు చేస్తే.. అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు భారీగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఒక్కసారే అయినా పెద్ద నష్టమే ఉంటుందని కేర్రేటింగ్ఏజెన్సీ ముఖ్య ఆర్థికవేత్త మదన్సబ్నవిస్పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల ప్రస్తుతమున్న వ్యవస్థలో పెద్దగా మారేదేమీ ఉండదనీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంవత్సరం మార్పు వెంటనే తీసుకువస్తే.. ఈ సంవత్సరంలో అమలులోకి తేనున్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే.. కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ శకానికి మారడం కోసం తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని కూడా మార్చేస్తే.. ఒకేసారి రెండు భారీ మార్పులకు అనుగుణంగా మారడం మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది.

 

రాష్ట్రాలు ఏమంటున్నాయంటే..:

ఆర్థిక సంవత్సర వ్యవస్థ మార్పు ప్రతిపాదనలను గత ఏడాది మహారాష్ట్ర వంటి కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ అమలు, ప్రణాళిక  ప్రణాళికేతర వ్యయాలను కలిపివేయడం వంటి కీలకమైన నిర్మాణాత్మక మార్పులు జరుగుతోందని, పరిపాలనా సమయం, మానవవనరులను అధికంగా ఈ మార్పులపై వెచ్చించాల్సి వస్తోందని.. ఈ  సమయంలో కొత్త ఆర్థిక సంవత్సర వ్యవస్థకి మారడం సాధ్యంకాకపోవచ్చునని మహారాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో పేర్కొంది.



రెండు మూడేళ్లు ఆగితే మంచిది..:

అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జనవరి  డిసెంబర్ఆర్థిక సంవత్సరానికి మారడం మంచిదే. అది దేశంలో కీలకమైన రుతుపవన చక్రానికి కూడా అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో ఈ మార్పును అమలు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. ప్రభుత్వం, పారిశ్రామిక రంగం ఒకసారే అయినా కొంతమేర నష్టపోవాల్సి ఉంటుంది. కొత్తగా అమలులోకి రానున్న జీఎస్టీ విషయంలో ఇప్పటికే పారిశ్రామిక వర్గాల్లో కొంత గందరగోళం ఉందని.. ఇప్పటికిప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని కూడా మార్చడం దీనిని మరింత పెంచుతుందని.. కాబట్టి ఆర్థిక సంవత్సరం మార్పు విషయంలో తొందరపడకపోవడం ఉత్తమమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన రెండు మూడేళ్ల తర్వాత ఆర్థిక సంవత్సరం మార్చుకోవచ్చని క్లియర్టాక్స్డాట్ఇన్సీఈఓ అర్చిత్గుప్తా పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top